Donald Trump : భారత్ పై డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో బాంబు పేల్చారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు (Tariffs) విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దిగుమతి చేసుకునే ఔషధాలపై 200 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్ అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఇదే జరిగితే అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడిన భారత్ ఫార్మా కంపెనీల (Pharma companies) కు ఆ మార్కెట్ దాదాపుగా మూసుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రంప్ సర్కారు ఔషధ దిగుమతులను సుంకాల నుంచి మినహాయించింది. తాజా ప్రతిపాదన అమలుకు నోచుకుంటే, అది భారత్ (India) ఫార్మాకు చావు దెబ్బ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అన్ని రకాల ఔషధ దిగుమతులపై కాకుండా, ఎంపిక చేసిన కొన్ని ఔషధ దిగుమతులపైనే ఈ సుంకాల పోటు ఉంటుందనే అంచనాలూ వినిపిస్తున్నాయి. అయితే సుంకాల విషయంలో భారత్, అమెరికాకు మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇవి మరో రెండు రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయని తెలుస్తోంది. ఈ ఒప్పందాలు కనుక ఖరారు అయితే కొత్త సుంకాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.