PM Modi: అది నేరస్థుల కూటమి.. బిహార్‌లో విపక్షాలపై మోడీ విమర్శలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రతిపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్’ కార్యక్రమంలో భాగంగా బిహార్ బీజేపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి ‘ఘట్‌బంధన్’ కాదని, ‘లత్ బంధన్’ (నేరస్థుల కూటమి) అని విమర్శించారు. ఆ కూటమిలోని నాయకులు ఢిల్లీ, బిహార్‌లలో బెయిల్‌పైనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలకు తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడం, అంతర్గతంగా కుమ్ములాటలు మాత్రమే తెలుసని ప్రధాని మోడీ (PM Modi) విమర్శించారు.
గతంలో బిహార్‌ను దశాబ్దాల పాటు నక్సలిజం, మావోయిస్టుల హింస పీడించిందన్న ప్రధాని.. స్కూళ్లు, హాస్పిటళ్లు ఏర్పాటు చేయడానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదని మోడీ గుర్తుచేశారు. రాష్ట్రం ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే ‘జంగిల్ రాజ్’ పాలనను ప్రస్తావించిన ఆయన.. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనను మరో వందేళ్లు గడిచినా ప్రజలు మర్చిపోలేరని మోడీ (PM Modi) అన్నారు. ఆ చీకటి జ్ఞాపకాలను యువతరానికి తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి నితీశ్ కృషి వల్ల రాష్ట్రం జంగిల్ రాజ్ నుంచి బయటపడి, ఇప్పుడు ప్రజలు గర్వంగా తమను తాము బిహారీలుగా పిలుచుకుంటున్నారని మోడీ కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం కోసం ఉమ్మడిగా కృషి చేయాలని మోడీ (PM Modi) పిలుపునిచ్చారు.







