RRR – PK: కూటమిలో చిచ్చు పెట్టిన ‘రాజకీయ’ పేకాట!
ఆంధ్రప్రదేశ్ లో పాలక కూటమి (NDA) అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య (Bhimavaram DSP Jayasurya) వ్యవహారం కూటమిలో చిచ్చు రాజేసింది. ఈ వివాదంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు, డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) మరోవైపు నిలబడటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన పాలక పక్షాల మధ్య సమన్వయం లోపించిందనే సందేహాలకు తావిచ్చింది.
ముఖ్యంగా జనసేన నేతలకు, కార్యకర్తలకు డీఎస్పీ జయసూర్య పనితీరుపై తీవ్రమైన ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ఆయన వైఫల్యం చెందారని, స్థానిక రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఆయన నేరుగా జిల్లా ఎస్పీకి డీఎస్పీ జయసూర్య పనితీరుపై ఫిర్యాదు చేశారు. కేవలం ఫిర్యాదుతో ఆగకుండా, డీఎస్పీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై హోంశాఖ కూడా దృష్టి సారించి, అంతర్గత విచారణకు సిద్ధమైంది.
పవన్ కల్యాణ్ చర్యలు కూటమిలో ఒక విధమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్న తరుణంలో, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (RRR) చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. భీమవరం రాజకీయాలపై, డీఎస్పీ వ్యవహారంపై ఆయన అనూహ్యంగా స్పందించారు. డీఎస్పీ జయసూర్య మంచోడు అంటూ కితాబిచ్చిన రఘురామ కృష్ణరాజు అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. “పేకాట లాంటివి గోదావరి జిల్లాల్లో చాలా కామన్. అక్కడ ఉండే అలవాట్లు అవి. డీఎస్పీ వాటిని అదుపు చేయాలని చూస్తేనే సమస్యలు వస్తాయి” అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. డీఎస్పీపై చర్యలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించిన సమయంలో, డిప్యూటీ స్పీకర్ ఆ డీఎస్పీకి మద్దతుగా మాట్లాడటం, అక్రమ కార్యకలాపాలను సమర్థించే విధంగా పేకాట సహజమంటూ మాట్లాడటం కూటమిలో పెను దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ఫిర్యాదును, ఆయన చర్యలను బహిరంగంగా ప్రశ్నించినట్లుగా, నిరాకరించినట్లుగా భావించాల్సి వచ్చింది.
రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సేనాని తీసుకున్న ప్రక్షాళన నిర్ణయాన్ని ఒక కూటమి నేతే వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రఘురామ కృష్ణరాజు తీరును తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పేకాట కామన్ అనే వ్యాఖ్యలు గోదావరి జిల్లాల సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడటంతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను సమర్థించడమేనని విమర్శించారు. ఈ ఘటనతో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం లోపించడం, ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని మరొకరు బహిరంగంగా తప్పు పట్టడం కూటమి రాజకీయాలపై అనేక సందేహాలను సృష్టించింది.
వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు. తన వ్యాఖ్యలను జనసైనికులు అపార్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు. అయితే, ఆయన వివరణ ఇచ్చేటప్పటికే రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చేసింది. మొత్తంమీద, భీమవరం డీఎస్పీ వ్యవహారం కేవలం ఒక పోలీసు అధికారి బదిలీతో ముగిసే అంశంగా కాకుండా, కూటమిలో అంతర్గత సమన్వయలేమిని సూచించింది.







