Janasena: అసెంబ్లీ సమావేశాలకు జనసేన పక్కా వ్యూహం.. లడ్డూ వివాదంపై వైసీపీకి కౌంటర్‌కు సిద్ధం..
ఏపీ శాసనసభ సమావేశాలు (Andhra Pradesh Assembly Sessions) వచ్చే నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 14వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏయే బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి అనే అంశాలపై అధికార వర్గాలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగా, ఈ సమావేశాలకు ప్రతిపక్షమైన వైసీపీ (YSR Congress Party) హాజరవుతుందా? లేక గతంలోలాగే సభకు దూరంగా ఉంటుందా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షం వచ్చినా రాకపోయినా అధికార పక్షం మాత్రం సమావేశాలను గట్టిగా వినియోగించుకునే వ్యూహంతో ముందుకెళ్తోంది.
ఈ క్రమంలో జనసేన పార్టీ (Jana Sena Party) ఒక అడుగు ముందే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనలో ఉన్న జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వర్చువల్ విధానంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అజెండాపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పవన్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తోన్న విమర్శలకు సభ వేదికగానే సమాధానం చెప్పాలని జనసేన నిర్ణయించిందని తెలుస్తోంది.
తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం కల్తీ అంశం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ సిట్ (CBI SIT) ఫైనల్ చార్జిషీటును నెల్లూరు ఏసీబీ కోర్టు (Nellore ACB Court)లో సమర్పించిన విషయం తెలిసిందే. గతంలో లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తోంది. సిట్ నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావన లేదని చెబుతూ, పవన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రచారం చేస్తోంది. దీనిని అసెంబ్లీలోనే తిప్పికొట్టాలని జనసేన శాసనసభాపక్షం నిర్ణయించినట్లు చెబుతున్నారు.
వైసీపీ హయాంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Temple) పరిధిలో జరిగిన అవకతవకలు, కల్తీ నెయ్యి సరఫరా, రసాయనాలతో తయారైన పదార్థాల వినియోగం వంటి అంశాలను సభలో లేవనెత్తాలని జనసేన ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇది భక్తుల విశ్వాసాలకు తీవ్ర భంగం కలిగించే విషయం అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలపై కేవలం అసెంబ్లీలోనే కాకుండా మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) సూచించినట్లు సమాచారం.
ఇదే సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన వెంటనే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం ద్వారా పార్టీ నిబద్ధతను పవన్ స్పష్టం చేశారని నేతలు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి భేటీ అయి వ్యూహాన్ని మరింత పదును పెట్టాలని జనసేన నిర్ణయించింది. మొత్తంగా చూస్తే, ఈసారి అసెంబ్లీ సమావేశాలు అధికార పక్షం, ముఖ్యంగా జనసేనకు రాజకీయంగా కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






