Walmart: ఫలిస్తున్న ట్రంప్ సర్కార్ టారిఫ్ కత్తి… హెచ్ 1బీ వీసాదారులు వద్దంటున్న వాల్ మార్ట్…!

హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం .. అక్కడి కంపెనీలపై పెనుభారంగా మారింది . తమకు ప్రతిభావంతులు కావాలంటే హెచ్1బీ వీసా దరఖాస్తులు తప్పవు. కానీ .. అలా చేస్తే వాటికోసం ఏకంగా లక్ష డాలర్లు కట్టాలి. దీంతో స్టార్టప్ లే కాదు.. ప్రతిష్టాత్మక సంస్థలు కూడా పునరాలోచనలో పడ్డాయి. మార్కెట్ దిగ్గజం వాల్ మార్ట్ సైతం.. కీలక నిర్ణయం తీసుకుంది.
హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేయాలని వాల్‌మార్ట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. వాల్‌మార్ట్‌లో ప్రస్తుతం 2వేల కంటే ఎక్కువమంది హెచ్-1బీ వీసా హోల్డర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాల విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమ కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించేందుకు గాను ప్రతిభావంతులను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు అని వైట్‌హౌస్ ఆ తర్వాత స్పష్టతనిచ్చింది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కారు మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. అమెరికాలోనే ఉండి వీసా స్టేటస్‌ను మార్చుకునే వారికి, ఇప్పటికే హెచ్1బీ ఉండి.. కొనసాగింపు కోరే వారికి ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని పేర్కొంది. విదేశాల నుంచి నేరుగా హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.