Venu Srinivasan: జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్…టాటా ట్రస్ట్స్ ఏకగ్రీవ నిర్ణయం

జీవిత కాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్ (Venu Srinivasan) పునర్నియామకానికి టాటా ట్రస్ట్స్ ఆమోదముద్ర వేసింది. ఈనెల 23తో ఆయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో, ఈ పరిణామం చోటు చేసుకుంది. టీవీఎస్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ అయిన శ్రీనివాసన్‌ను టాటా ట్రస్ట్స్‌లో జీవితకాల ట్రస్టీగా నియమించే ప్రతిపాదనకు ఏకగ్రీవ అంగీకారం లభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాజా పరిణామం అనంతరం, మెహ్లీ మిస్త్రీ పునర్నియామకంపైనే అందరి దృష్టీ పడనుంది. టాటా ట్రస్ట్స్‌లో నోయల్ టాటా, మెహ్లీ వర్గాలుగా సభ్యులు చీలిపోయిన నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది. ఈనెల 28న మిస్త్రీ పదవీకాలం ముగియనుంది. ఈయన్ని కూడా జీవితకాల ట్రస్టీగా నియమించేందుకు ట్రస్టీల ఆమోదం అవసరమవుతుందా లేదా ఆటోమేటిక్‌గా కొనసాగింపు ఉంటుందా అన్న విషయంలోనూ స్పష్టత లేదు.
టాటా ట్రస్ట్స్ ప్రాధాన్యమిదీ
సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సహా పలు ఛారిటబుల్ ట్రస్టులకు వేదికగా టాటా ట్రస్ట్స్ ఉంది. 156 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66% వాటా ఉంది. 30 నమోదిత కంపెనీలు సహా 400 వరకు కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి.