BrahMos Missile: మరింత పదును తేలుతున్న బ్రహ్మోస్ .. ప్రత్యర్థులకు ఇక చుక్కలు కనిపిస్తాయి…!

బ్రహ్మోస్ (BrahMos).. ఈ మిస్సైల్ పేరు వింటే చాలు ప్రత్యర్థి దేశాలు వణుకుతున్నాయి. ఎందుకంటే .. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ మిస్సైల్ చేసిన ఘర్జనలు ఇంకా ఆయాదేశాల నేతల చెవుల్లో మారుమోగుతున్నాయి. దాయాది సైన్యానికి నిద్ర లేని రాత్రులు మిగిల్చిన క్షిపణి ఇప్పుడు మరింత పదునుదేలుతోంది. భారత రక్షణరంగ సంస్థలు ఇప్పుడు దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో పడ్డాయి. దీంతో పాటు గగనతలం పైనుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది.
800 రేంజికి పరీక్షలు..
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి రేంజి ప్రస్తుతం 450 కిలోమీటర్లుగా ఉంది. ఇది శబ్ద వేగం కంటే 2.8 రెట్లు అధిక స్పీడుతో దూసుకుపోగలదు. సుఖోయ్-30 ఎంకేఐ దీనిని ప్రయోగించగలదు. ఇప్పుడు దీనిని 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తైపోయింది. దీనిలోని ఇనర్షల్ నేవిగేషన్ వ్యవస్థ-ఎక్స్‌టర్నల్ గ్లోబల్ నేవిగేషన్ వ్యవస్థ కాంబినేషన్‌కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే.. సూటిగా 800 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్‌నే సాఫ్ట్‌వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసిన రేంజిని పెంచే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. క్షిపణి డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరింయట్‌ను.. చివరిగా వాయుసేన వాడే వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
స్కై వార్ స్ట్రాటజీ…
ఆధునిక కాలంలో గగనతల యుద్ధంలో ఫైటర్ నేరుగా తలపడటం అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతోంది. శత్రువును చాలా దూరంగానే గుర్తించి.. నేలకూల్చడం ఇప్పటి ట్రెండ్. దీనిలో బీవీఆర్ (బియాండ్ విజువల్ రేంజి) క్షిపణుల పాత్ర కీలకం. భారత్ వద్ద అస్త్ర మార్క్-2 పేరిట బీవీఆర్ క్షిపణి ఇప్పటికే ఉంది. దీని రేంజి 160 కిలోమీటర్లు. ప్రస్తుతం వాయుసేన ఈ క్షిపణి సామర్థ్యాన్ని 280 కిలోమీటర్లకు పెంచే పనిలో నిమగ్నమైంది. ఇక అస్త్ర మార్క్-1 రేంజిని 100 కిలోమీటర్లకు పొడిగించనుంది.
మరో ఆరు నెలల్లో అస్త్ర మార్క్-2ను ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిని సుఖోయ్-30 ఎంకేఐ, తేజస్‌లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్ జెట్ ఇంజిన్‌తో పనిచేసే అస్త్ర మార్క్-3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజిని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి బీవీఆర్ క్షిపణుల దిగుమతి తగ్గిపోతోంది.