Mukesh Sahani: బిహార్ ఇండియా కూటమికి దిక్సూచీగా ‘వీఐపీ’ సహనీ?..

బిహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి అడుగులేస్తోంది. దీనిలో భాగంగా వెనకబడిన వర్గాల ఓట్లను రాబట్టేందుకు పక్కా ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగా ఓ యువనేతను ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్య పరిచింది.ఆయనే వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు ‘ముకేశ్ సహనీ’. కొన్నేళ్ల క్రితం రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించిన ఆయన (Mukesh Sahani).. విపక్షం తరఫున మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
సేల్స్‌మెన్ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా..
ముకేశ్ సహనీ.. దర్భంగాలో ఓ మత్స్యకారుల కుటుంబంలో 1981లో జన్మించారు. 19వ ఏట ముంబయికి వెళ్లి సేల్స్‌మెన్‌గా పనిచేసిన ఆయన.. కొంతకాలానికి స్టేజ్ డిజైనర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ముకేశ్ సినీవరల్డ్ పేరుతో ఓ చిన్న కంపెనీని స్థాపించి సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. నిషాద్ (పడవలు నడిపే, జాలర్లు) వర్గానికి చెందిన ఈయన.. పట్నా, దర్భంగాలలో పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తన సామాజిక వర్గం ‘మల్లా కుమారుడు’ (Son of Mallah)గా తనదైన ముద్ర వేసుకున్నారు. మల్లా.. నిషాద్ వర్గంలో ఉప కులంగా ఉంది. రాష్ట్రంలో నిషాద్‌ల జనాభా 9.6శాతంగా ఉండగా, సహనీకి చెందిన మల్లాలు 2.6శాతంగా ఉన్నట్లు అంచనా.
ప్రధాని మోడీ చొరవతో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన సహనీ.. తదనంతరం నిషాద్ వర్గ నాయకుడిగా ఎదిగారు. అయితే, తమ వర్గానికి ఎస్పీ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ నేరవేర్చకపోవడంతో కమలానికి దూరమయ్యారు. అదే ఏడాది నిషాద్ వికాస్ సంఘ్ పేరుతో తన సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నం చేశారు. 2018లో వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP)ని స్థాపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లో చేరి పోటీ చేసినప్పటికీ ఖాతా తెరవలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేయగా.. వీఐపీ తరఫున నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన సహనీకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీజేపీ.. పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పదవి అప్పగించింది. అయితే, ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడం, మరో ముగ్గురు 2022లో బీజేపీలో చేరిపోవడంతో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సహనీ ఎమ్మెల్సీ పదవి కూడా ముగియడం, మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారు.