Jagan-Balakrishna: ‘తాగి అసెంబ్లీకి వచ్చారు’ బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (TDP MLA), సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై (Nandamuri Balakrishna) మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ తనను ‘సైకో’ (Psycho) అని సంబోధించిన అంశంపై జగన్ తొలిసారిగా స్పందించారు. బాలకృష్ణ ‘తాగి వచ్చి’ అసెంబ్లీలో మాట్లాడారని ఆరోపించారు.
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పెద్దలు జగన్‌ను కలిసేందుకు వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో ప్రస్తావించారు. చిరంజీవి జోక్యం చేసుకున్న తర్వాతే జగన్ సినీ పెద్దలను కలిశారని కామినేని వివరించగా, దానిపై స్పందించిన బాలకృష్ణ, ఆ పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్‌ను ఉద్దేశించి “ఆ సైకోను కలిసేందుకు నాకూ ఆహ్వానం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు” అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.
బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్‌పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చిరంజీవి కూడా ఓ అజ్ఞాత లేఖ విడుదల చేసి జగన్ తమను బాగా చూసుకున్నారని వివరించారు. అయితే అప్పట్లో జగన్ మాత్రం స్పందించలేదు. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్, బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని జగన్ ఆరోపించారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీ స్పీకర్ ఎలా అనుమతించారు? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదికని గుర్తు చేస్తూ, ఆయన పనీపాటలేని సంభాషణలు చేశారన్నారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అని జగన్ నిలదీశారు. బాలకృష్ణ మాటల తీరును బట్టే ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోందని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆయన మండిపడ్డారు. బాలకృష్ణకు కౌంటర్ ఇస్తూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
జగన్‌ను బాలకృష్ణ ‘సైకో’ అనడం, ఇప్పుడు దానికి బదులుగా జగన్, బాలకృష్ణ ‘తాగి వచ్చారు’ అని ఆరోపించడంతో మాటల యుద్ధం మరింత పెరిగింది. ఈ ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత దూషణలు, ఎదురుదాడితో కూడిన ఈ రాజకీయ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో వేచి చూడాలి. ప్రజా సమస్యల కంటే నేతల మధ్య మాటల ఘర్షణకే ఎక్కువ ప్రాధాన్యం వస్తోందనే విమర్శలు కూడా ఈ నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ కామెంట్స్‌పై టీడీపీ నేతలు, ముఖ్యంగా బాలకృష్ణ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.