Kolikapudi Vs Kesineni: కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు.. హైకమాండ్ సీరియస్..!

తెలుగుదేశం పార్టీలో (TDP) విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni), తిరువూరు (Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. తాజాగా కొలికపూడి శ్రీనివాస రావు, కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణల కారణంగా ఇద్దరి మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం డబ్బులు అడిగారంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఆరోపణలు, పార్టీలో కలకలం రేపాయి. ఈ వివాదంపై ఆగ్రహించిన టీడీపీ అధిష్ఠానం, సమస్య పరిష్కారం కోసం ఇద్దరు నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ అధిష్టానానికి పెద్ద సమస్యగా మారారు. గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొలికపూడిని పార్టీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది. అయినా ఆయన తీరులో మార్పు కనిపించట్లేదు. తాజాగా ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. 2024 సాధారణ ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ఎంపీ కేశినేని చిన్ని ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని కొలికపూడి ఆరోపించారు. ఈ మేరకు తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు.
తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన రూ. 50 లక్షలు, తన మిత్రులు ఇచ్చిన రూ. 3.50 కోట్లు గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణల తీవ్రతను పెంచాయి. ‘నిజం గెలవాలి.. నిజమే గెలవాలి’ అనే నినాదంతో ఆయన పోస్టులు పెట్టడం విశేషం. అంతేకాదు.. తాను జగన్ పై పోరాటాలు చేసి రాజకీయాల్లోకి వచ్చానని, కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బుతో రాలేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు టీడీపీతో పాటు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి.
ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తాం’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా, తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని, డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఎవరు ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసంటూ పరోక్షంగా కొలికపూడిపై విమర్శలు చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే పరస్పర ఆరోపణలతో పార్టీ పరువు మసకబారుతోందని గ్రహించిన టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ముఖ్యంగా టికెట్ కోసం డబ్బుల వ్యవహారంపై మాట్లాడటం పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించింది. ఈ నేపథ్యంలో, సమస్యను తక్షణమే పరిష్కరించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇద్దరు నేతలను పార్టీ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.