Donald Trump: మోడీతో మాట్లాడా.. రష్యా చమురు కొనొద్దని చెప్పా: ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోడీతో (PM Modi) తను ఇటీవలే ఫోన్‌లో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్ చేశానని చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి భారత్, పాక్ యుద్ధం తానే ఆపానని చెప్పిన ఆయన.. పాక్‌తో బంధాల గురించి కూడా మోడీతో మాట్లాడానన్నారు. అలాగే రష్యా చమురు అంశం కూడా చర్చకు వచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గిస్తానని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు.
ఈ ఫోన్ కాల్ విషయాన్ని భారత్ కూడా ధ్రువీకరించింది. ప్రధాని మోడీ (PM Modi) ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే ఈ ఫోన్ కాల్ సంభాషణపై ఇరువైపుల నుండి భిన్న వాదనలు వెలువడటం ఆసక్తికరంగా మారింది. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు (Donald Trump) ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. అయితే, ఈ ఫోన్ కాల్ సందర్భంగా భారత్-పాకిస్తాన్ సంబంధాలపై చర్చ జరిగినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ అంశం తమ ఈ ఫోన్ సంభాషణలో ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా, శ్వేతసౌధంలో దీపావళి వేడుకల్లో ట్రంప్ (Donald Trump) పాల్గొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురు కొనుగోళ్లపై కూడా మోడీతో మాట్లాడానని, భారత్ అతిగా కొనుగోలు చేయకూడదని చెప్పానని వ్యాఖ్యానించారు.