Sunil Amrith: భారతీయ సంతతి రచయితకు ‘బ్రిటిష్ అకాడమీ బుక్‌ప్రైజ్’
భారత సంతతికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు సునీల్ అమృత్ (Sunil Amrith) రచించిన ‘ది బర్నింగ్ ఎర్త్: యాన్ ఎన్విరాన్‌మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 ఇయర్స్’ పుస్తకం ఈ ఏడాది బ్రిటిష్ అకాడమీ బుక్‌ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పురస్కారంలో భాగంగా 25 వేల పౌండ్ల నగదు బహుమతిని అందిస్తారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న 46 ఏళ్ల సునీల్ అమృత్ (Sunil Amrith) తల్లిదండ్రులు దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం విశేషం. సింగపూర్‌లో పెరిగిన ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.
ప్రస్తుతం ప్రపంచం వాతావరణ సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సునీల్ అమృత్ (Sunil Amrith) రాసిన పుస్తకాన్ని తప్పక చదవాలని న్యాయనిర్ణేతలు పేర్కొన్నారు. మానవ, పర్యావరణానికి హాని కలిగించే అంశాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఆ అంశాల గురించి ఈ పుస్తకం వివరిస్తుందని అమృత్ తెలిపారు. పర్యావరణ చరిత్ర విభాగంలో ఈ రచన అంతర్జాతీయ గుర్తింపు సాధించింది.







