Indian-Origin Man: డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్.. ముగ్గురి మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తి అరెస్ట్!
అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సంతతికి (Indian-Origin Man) చెందిన ట్రక్ డ్రైవర్ జషన్‌ప్రీత్ సింగ్.. డ్రగ్స్ తీసుకొని ట్రాఫిక్ జామ్‌లో ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. తన ముందు వాహనాలు ఆగి ఉన్నా జషన్‌ప్రీత్ కనీసం బ్రేకులు వేసే ప్రయత్నం చేయకుండా.. నేరుగా వెళ్లి వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. జషన్‌ప్రీత్ సింగ్‌ను (Jashanpreet Singh) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 8 వాహనాలకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
కాలిఫోర్నియాలో నివసించే జషన్‌ప్రీత్ సింగ్ మాదక ద్రవ్యాల మత్తులో వాహనం నడిపినట్లు అధికారుల విచారణలో తేలింది. ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ, అతను బ్రేకులు వేయడానికి కూడా ప్రయత్నించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అతనిపై (Jashanpreet Singh) వెహిక్యులర్ మాన్‌స్లాటర్ కేసుతో పాటు డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేసినందుకు డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్) కేసులు నమోదు చేశారు.
జషన్‌ప్రీత్ 2022 మేలో యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించి, బోర్డర్ పెట్రోల్ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ విచారణ నిమిత్తం ఎల్‌సెంట్రో ప్రాంతంలో అతన్ని (Jashanpreet Singh) విడుదల చేశారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం మరో భారత సంతతి ట్రక్ డ్రైవర్ తప్పుడు ప్రాంతంలో సిగ్నల్ ఇవ్వకుండా యూటర్న్ తీసుకొని, ముగ్గురి మరణానికి కారణమైన సంగతి తెలిసిందే.







