Lambasingi: ‘ఆంధ్ర కశ్మీర్’ లంబసింగి .. తప్పక చూడాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాలు మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే ఈ రాష్ట్రంలో పర్యాటకులు పెద్దగా దృష్టి పెట్టని అద్భుతమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో లంబసింగి ఒకటి. ‘ఆంధ్రప్రదేశ్ కశ్మీర్’ (Andhra Kashmir) అని పిలిచే ఈ ప్రాంతం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. లంబసింగికి (Lambasingi) ఈ పేరు రావడానికి సరైన కారణమే ఉంది. తూర్పు కనుమల్లోని ఈ చిన్న గ్రామం దక్షిణ భారతదేశంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించే అరుదైన ప్రదేశం ఇది. ముఖ్యంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో ఇక్కడి లోయలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఈ సమయంలో పర్యాటకులకు అద్భుత దృశ్యాలను కనిపిస్తాయి.
లంబసింగిలో (Lambasingi) పెద్ద రిసార్ట్‌లు లేకపోవడం కూడా ఈ ప్రదేశం ప్రత్యేకతే. పర్యాటకులు స్థానిక హోమ్‌స్టేలలో బస చేసి, పొలాల్లో పెరిగే స్ట్రాబెర్రీలను ఆస్వాదించవచ్చు. అలాగే సాంప్రదాయ చుల్హా వంటకాలను రుచి చూడవచ్చు. తెల్లవారుజామున బయటకొస్తే ఆకులపై మంచు బిందువులను చూడటం మరపురాని అనుభూతినిస్తుంది. లంబసింగి (Lambasingi) సందర్శన కేవలం ప్రకృతిని ఆస్వాదించడం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో కశ్మీర్ వంటి చల్లని అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఎప్పుడూ ట్రాఫిక్, బిజీ బిజీ జీవితాలు గడిపే వారికి.. ఇది ఒక ప్రశాంతమైన విహారయాత్రను అందిస్తుంది.







