SIR: దేశవ్యాప్త ఎస్ఐఆర్‌కు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమానికి సన్నద్ధం కావాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను (సీఈవోలను) కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. బుధ, గురువారాల్లో ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐఆర్ (SIR) అమలు తీరుపై ఉన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) ఆధారంగా, ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేసేందుకు తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా ఈసీ సమీక్ష నిర్వహించింది.
రాబోయే ఏడాది కాలంలో ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలైన అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఓటర్ల జాబితాల పరిస్థితిని ఈసీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఈసీ తెలిపింది.







