International Students : అమెరికా వీసాల రద్దు … న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

పాలస్తీనా అనుకూల ఆందోనల్లో పాల్గొన్నారన్న కారణంగా తమ వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేయడం పై పలు విద్యా సంస్థల్లోని విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలను రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్ (Harvard), స్టాన్‌ఫర్డ్ (Stanford) వంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సహా మేరీలాండ్ (Maryland), ఒహాయో స్టేట్ (Ohio State ) వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు (International Students) న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఉన్నారు.
కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారినీ స్వచ్చందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ తొలుత అధికారులు ఈ మెయిళ్లు పంపారు. తాజాగా విద్యార్థుల వీసా (Visa)లను రద్దు చేశారు. దీంతో అక్కడి స్కాలర్లకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. మరోవైపు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలూ రద్దయినట్లు కశాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీసాలు రద్దు చేసినట్లు చెబుతుండగా, మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు తెలియజేయట్లేదని కోర్టుకు విద్యార్థులు విన్నవించారు.