H1B VISA :భారత్ కు తిరిగిరాకుండానే హెచ్1 బీ రెన్యూవల్!
స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్-1బీ వీసా(H1B VISA) రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల (Indians) కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్-1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ (Stamping )పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్-1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా (America )గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ఫైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్-1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యూవల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్-1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే.






