అమెరికా ఎన్నికలపై మనవాళ్ళు ఏమంటున్నారు…?
అమెరికాలో దాదాపు 5- 6 మిలియన్ ల భారతీయులు ఉండగా అందులో 21 లక్షల మంది అమెరికా సిటిజన్లుగా అధ్యక్ష ఎన్నికల్లో వోట్ వేయబోతున్నారు. మొదట్లో భారతీయ కమ్యూనిటీ అందరూ దాదాపుగా ఉద్యోగస్తులు కనుక డెమోక్రాటిక్ పార్టీ తమ మద్దతు తెలిపే వారు. అయితే 15 ఏళ్లలో అమెరికా భారతీయులు బిజినెస్ రంగంలో, ఐటీ రంగంలో ప్రవేశించి ఎంట్రెప్రినూర్లుగా ఎదుగుతున్నారు కనుక రిపబ్లికన్ పార్టీ కి మద్దతు తెలపడం మొదలెట్టారు. మన తెలుగు వారి పరిస్థితి కూడా దాదాపు ఇలానే వుంది. తెలుగు కమ్యూనిటీలో కొందరితో తెలుగు టైమ్స్ మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించి ప్రచురించింది. – ఎడిటర్
ఆర్థిక మాంద్యంతో సతమతం : రాజు చింతల, ఇండియానాపోలిస్
అమెరికా నాలుగు సంవత్సరాలుగా విపరీతమైన ఆర్థిక మాంద్యం(ఇన్‌ప్లేషన్)తో సతమతమవుతోంది. దాని వలన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. మరోపక్క ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్`రష్యా యుద్ధం, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ దేశాలు యుద్ధబాట పట్టాయి. ఒక్కసారి ట్రంప్ కాలం గమనిస్తే ఆ నాలుగు సంవత్సరాలో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు పెద్దగా లేవు. పెట్రోలు ధర 3 డాలర్లలోనే ఉండేది. ఇప్పడు 5 డాలర్లకు వెళ్లిపోయింది. కొవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక వ్యవస్థ, ధరలు స్థిరంగా ఉండేవి. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కూడా ఈరోజు ట్రంప్ రావాలి అని కొరుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వస్తే అమెరికా స్థిరంగా ఉంటుంది.
ప్రస్తుతం కొన్ని సర్వేలు ట్రంప్ ప్రజాధరణలో ఆధిక్యంతో ఉన్నారని, మరికొన్ని సర్వేలలో హారిస్ ఆధిక్యంలో ఉన్నారని చెబుతున్నాయి. వాటిని పక్కన పెడితె తటస్థంగా ఉండే రాష్ట్రాలు (మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, ఆరిజోనా, జార్జియా) కూడా ఎన్నికలు సజావుగా జరిగి ట్రంప్‌కి తమ మద్దతు ఇస్తాయని ట్రంప్ ఎన్నిక తప్పనిసరిగా జరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం. అయితే రాష్ట్రాలలో నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఓటరుని తన డ్క్రెవింగ్ ల్కెసెన్స్ ను ఆధారంగా గుర్తించే ప్రక్రియ జరగాలి. అప్పుడు ఎలాంటి దొంగ వోట్లు పడవు. అన్ని రాష్ట్రాలు ఎన్నికలను సజావుగా నిర్వహించాలి.
నేను డెమోక్రటిక్ పార్టీ వాలంటీర్‌ని : లక్ష్మి కొచ్చెర్లకోట, బోస్టన్
నేను మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీకి ఎంతో అభిమానంగా ఉండే వాలంటీర్‌ని. 20 ఏళ్లుగా ఆ పార్టీలో నేను క్రీయాశీల సభ్యురాలినే అని చెప్పొచ్చు. ఈ వాలంటీర్లుగా ఉండే వాళ్ళు అనేక రకాల పనులు చేస్తారు. ఫోన్లు చేసి ఓటర్లను ప్రభావితం చేయాలి. టెక్స్ట్ బ్యాంక్ అంటే వోటరు ఫోన్ నెంబరుకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాముల ద్వారా ప్రమోషన్ చేయడం. నేను ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్‌లను పంపే పనికి ఇష్టపడుతాను. అలాగే కొత్త వలంటీర్లను రిక్రూట్ చేసే పని కూడా చేస్తాను. నేను డిసిసి (డెమోక్రటిక్ కాంగ్రెసెషనల్ క్యాంపెయిన్ కమిటీ)సభ్యురాలిగా నా వంతు ప్రచారం నేను చేస్తూనే ఉంటాను.
ప్రస్తుతం బ్కెడెన్ ఎన్నికల నుంచి తప్పుకొని కమలా హారిస్ రేసులోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ట్రంప్ చాలా వరకు జిమ్మిక్స్ చేస్తారు అని ప్రజలకు తెలుసు. అయితే కొన్ని రాష్ట్రాలలో ట్రంప్ గ్రూపు నుంచి ఎలక్ట్రిక్ వాహనం ప్రతి ఊరు తిరిగి, కొత్త కొత్త హామీలను చేస్తోంది. వాటికి ప్రత్యామ్నాయంగా హారీస్ గ్రూపు కూడా ధీటుగా ప్రచారం చేస్తోంది. స్వింగ్ స్టేట్స్ లలో కూడా కమలాహారీస్ కి ఓట్ల్లు పడతాయి అని మేము నమ్ముతున్నాం. అందువలన కమలా హారిస్ గెలుస్తుందని మా నమ్మకం.
ట్రంప్ ఒక దృఢమైన నాయకుడు : ప్రసాద్ కునిసెట్టి, న్యూజెర్సీ
ప్రస్తుత ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా గెలుస్తాడని నా నమ్మకం. ఎందుకంటే అమెరికన్స్ చాలా గట్టిగా ట్రంప్ ఒక దృఢమైన నాయకుడు అని, ఇన్ఫ్లేషన్ అవుతాడని, ధరలని తగ్గిస్తాడని, బయట దేశాల నుంచి చట్టవిరుద్ధంగా, దొంగ చాటుగా వచ్చే వలసలను ఆపుతాడని నమ్ముతున్నారు. కమలా హరిస్ మధ్య తరగతి నుంచి కష్టపడి పైకి వచ్చిన మహిళగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నా.. ఆమె అధ్యక్ష పదవికి సరిపోదని ప్రజల అభిప్రాయం. అమే అధ్యక్ష ఎన్నికలలో నిలిచిన రోజున అందరి దగ్గర నుంచి ఉవ్వెత్తున మద్దతు వచ్చినా, అది ఎక్కువ రోజులు నిలువ లేదు. కారణం వైస్ ప్రెసిడెంట్‌గా ఏమీ చేయలేదు. బ్కెడెన్ ప్రభుత్వం మీద ఉన్న కోపం అమె ఎన్నికల మీద పడుతోంది అని నా అభిప్రాయం. ఈ కారణాల వలన ట్రంప్ గెలవడం ఖాయం అని అనుకొంటున్నాను.
సౌత్ ఏషియన్లు ఆమెకే మద్దతు.. సుబ్బాయంత్ర, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
నా ఉద్దేశ్యం కమలా హారిస్ మొట్టమొదటి బ్లాక్/బ్రౌన్ అమెరికన్‌గా, మహిళగా అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించబోతోంది. తాను మొదటగా భారతీయ/సౌత్ ఏషియన్ మహిళగా ఎన్నికల బరిలో దిగింది. కాబట్టి అమెరికాలో ఉన్న సౌత్ ఏషియన్లు అందరూ ఆమెకు మద్దతుగా ఉండి ఓటు చేస్తారని నేను అనుకొంటున్నాను. ఈ మధ్య కాలంలో అమెరికాలో మెడికల్, టెక్నాలజీ, బిజినెస్ రంగాలలో ఎషియన్లు చాలా ముందుకు వెళ్ళారని అందరికి తెలుసు. వారు ఇప్పడు రాజకీయ రంగంలోను కూడా ప్రవేశించి కూడా హరిస్కి మద్దతుగా నిలుస్తారని నా నమ్మకం. అయితే అమెరికా ఎన్నికలలో ఈసారి కూడా అటు ట్రంప్‌కి, ఇటు హారిస్ కి చెప్పుకొనేంత పెద్దగా ఆదరణ లేదని, అందువలన తటస్థంగా ఉండే రాష్ట్రాల మీద ఎన్నికల ఫలితాలు ఆధార పడ్డాయని తెలుసు. అందువలన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో ఉన్న సౌత్ ఏసియన్స్ వల్ల హరిస్కి మద్దతు వస్తుందని నా ఉద్దేశం. అదే సమయంలో ఇపుడున్న రేసియల్ వాతావరణానికి డెమొక్రటిక్ ప్రభుత్వమే ఉండడం చాలా అవసరం. మంచిది కూడా.
ఇండియాకి డెమోక్రటిక్ పార్టీకి మంచి రిలేషన్షిప్ ఉంది : కె.వి.సి రావు, లాస్ఎంజెలిస్
నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేస్తున్నాను. ఎప్పుడు నా ఓటు డెమోక్రటిక్ పార్ట్టీకే వేస్తాను. ఎందుకంటే మొదటి నుంచి ఇండియాకి అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి మంచి రిలేషన్షిప్ ఉండేది. అందుకని సాధారణంగా అమెరికాలో ఉన్న మా తరం భారతీయులు (ఎన్ఆర్ఐలు) డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటాము. ప్రస్తుత పరిస్థితిలో ట్రంప్ చాలా జిమ్మిక్లు చేస్తున్నాడు. ఆయన ప్రచారం ప్రజలను కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది. తన ప్రత్యర్థి మహిళ అని బ్లాక్ అమెరికన్ అని, బ్రౌన్ అమెరికన్ అని అనేక విధాలుగా ఆ వ్యక్తి కంటే నేను బెటర్ అని చెపుతూ ఉంటాడు. కమలా హారిస్ గాని, ఆమె పార్టీ ప్రచార ఏజంట్లు గాని ఈ ట్రంప్ చేసే అభియోగాలని త్రిప్పికొట్టగలగాలి అప్పుడే కమలా హారిస్ గెలవగలదు.
బైడెన్ ప్రభుత్వం ధరలను అదుపుచేయడంలో పూర్తిగా విఫలం : అంజయ్య చౌదరి లావు, అట్లాంటా
ప్రస్తుతం దేశంలో ధరలు బాగా పెరిగి పోయాయి. బైడెన్ ప్రభుత్వం ధరలను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇదివరకు 100 డాలర్లకు కిరాణా సామాన్లు, 50 డాలర్లతో కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు అవి దాదాపుగా రెట్టింపు అయ్యాయి. ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగలేదు. అలాగే గాన్ (పెట్రోలు) ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పైగా మెక్సికో నుంచి, కెనడా నుంచి వలసదారులు వచ్చి, ప్రతి పట్టణంలోనూ స్థిరపడుతున్నారు. ఈ పరిస్థితులను అమెరికా ప్రజలు బాగా గమనిస్తున్నారు. ట్రంప్ వస్తే ధరలను అదుపు చేస్తారని, ఎకానమీని స్థిరంగా ఉంచుతారని నమ్ముతున్నారు. అందుకే ట్రంప్ గెలుస్తాడని నా నమ్మకం. అలాగే ఇండియా నుంచి వచ్చిన మొదట్లో చాల వరకు ఎన్ఆర్ఐలు డెమోక్రాటిక్ పార్టీ మద్దతు ఇవ్వటం సహజమే. కానీ వారు ఈ దేశంలో సెటిల్ అయి, బిజినెస్ మెన్ గా ఎంట్రెప్రినేటర్లుగా మారాక రిపబ్లికన్ పార్టీ పధకాలు, పోలసీలు నచ్చి మెల్లగా రిపబ్లికన్ పార్టీ వైపు మారడం జరుగుతుంది. ఆ విధంగా కూడా లీగల్ గా వచ్చే ఇమ్మిగ్రెంట్స్ మద్దతుతో ట్రంప్ గెలుస్తాడని అనుకొంటున్నాను.
ఒబామా కేర్ ఎంతో మందికి ఉపయోగపడింది : మహిళా డాక్టర్, డల్లాస్
నేను వృత్తి రీత్యా డాక్టర్‌గా వుండి , అనేక మంది పేషెంట్స్‌తో వుంటాను కనుక నా పేరు చెప్పటం ఇష్టం లేదు. నేను మెడిసిన్ చదివేట ప్పుడు ఒబామా అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒబామా కేర్ ఎంతో మందికి ఉపయోగపడిరది. ప్రపంచాల లోని అనేక దేశాలు కూడా ఈ ప్రణాళిక ని మెచ్చుకొన్నాయి. అలాగే నా భర్త ఒక బిజినెస్ మాన్. మాలాంటి చిన్న వ్యాపారస్తులకు డెమోక్రాటిక్ పార్టీలో సరైన పధకాలు, ప్రణాళికలు ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ అంటే పెద్ద వ్యాపారవేత్తలకు ఉపయోగం. అందుకని నేను కమల హరీశ్‌కే వోట్ వేస్తాను.
ట్రంప్ రావాల్సిన అవసరముంది.. శ్రీధర్ పులిపాక, కాలేజీ స్టూడెంట్, డల్లాస్
అన్ని చోట్ల ఇన్‌ప్లేషన్ వలన అన్ని ధరలు బాగా పెరిగిపోయాయి. ట్రంప్ గెలిచాక, రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎకానమీ స్థిరంగా వుండి, ధరలు అన్ని తగ్గుతాయి అని నా నమ్మకం. ధరలు తగ్గాలి అంటే ట్రంప్ రావాలి.
ఈ సారి ఎన్నికలలో రెండు వర్గాలకు పెద్దగా ఆదరణ లేదు.. వెంకట్ తాడినాడ, శాన్‌హోసే
20-25 ఏళ్లుగా అమెరికా అధ్యక్షా ఎన్నికలను నిశితంగా గమనిస్తున్న నాకు ఇప్పటి ఎన్నికల ప్రచారం, తీరుతెన్నులు చూస్తుంటే చాల బాధ గా వుంది. ఎవరు గొప్ప వారు ? ఎవరు సమర్థులు ? అన్న ఆలోచన కంటే ఎవరు దేశానికి తక్కువ హాని చేస్తారు ? అన్న ఆలోచనతో ఓటర్ వోట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. డెమోక్రసీ అఫ్ అమెరికా గురించి గొప్పగా చెప్పుకొనే రోజుల నుంచి డీసెన్సీ అఫ్ అమెరికా గురించి మాట్లాడుకొనే రోజులు వచ్చాయి. మొదటిసారి 2022లో బైడెన్ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసే సమయం లో అప్పటి వరకు అధ్యక్షుడిగా వున్న ట్రంప్ రాలేదు. కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలుపలేదు. అప్పుడే మన అమెరికా డీసెన్సీ పోయింది. అన్ని కేసులు వున్నా డోనాల్డ్ ట్రంప్‌నే మళ్ళీ కాండిడేట్ గా రిపబ్లికన్ పార్టీ పెట్టటం, డెమోక్రాటిక్ పార్టీ కూడా ఒక సమర్ధవంతమైన అభ్యర్థిని నిలబెట్టకుండా మళ్ళీ బైడెన్ ఉంటాడని చెప్పటం, మధ్యలో ఆయన ఎన్నికల బారి నుంచి తప్పు కోవడం, హడావిడిగా కమలా హరీస్ ముందుకు రావడం కూడా సరి కాదు అని నా అభిప్రాయం. ఈ సారి ఎన్నికలలో రెండు వర్గాలకు పెద్దగా చెప్పుకోదగ్గ ఆదరణ లేదని ఇద్దరికీ 50%కి అటూ ఇటు గా ప్రజల మద్దతు ఉందని సర్వే లు చెపుతున్నాయి. ఆంటే ఈ ఎన్నికలు పూర్తిగా స్వింగ్ స్టేట్స్ మీద అధార పడి వున్నాయి.
కమలా హారిస్ వల్ల డెమొక్రాట్ పుంజుకుంది : రమేష్ కొండా, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
జనరల్‌గా డెమోక్రాట్స్ కొంచెం బాలెన్సడ్ గాను, రిపబ్లికన్స్ కొంచెం రాడికల్ గాను వుంటారు. ఈసారి ఎలక్షన్స్‌లో బైడెన్ తప్పుకొని కమలా హరిస్ వచ్చాక డెమొక్రాట్ పార్టీ పుంజుకుంది. కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్‌గా గత 3 నెలలలో ఎంతో ఆక్టివ్‌గా ఉంటూ ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తోందని చెప్పొచ్చు. కమలా హరీశ్ ఇంత క్రితం కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. ప్రెసిడెంట్‌కి లీగల్ బాక్గ్రౌండ్ వుండటం మంచిదే కనుక కమలా హారిస్ లీడర్షిప్ అమెరికాకి మంచిదే అని అనుకొంటున్నాను.
అందరూ కమలా హ్యారిస్ వైపు మొగ్గుచూపుతున్నారు.. జయంత్ చల్ల, న్యూజెర్సీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా గెలిచి, మరోసారి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అదే సమయంలో ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్.. డెమొక్రాట్ పార్టీ తరఫున బరిలో నిలిచింది. వీళ్లిద్దరి మధ్య గట్టి పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారో అంచనా వెయ్యడం కొంచెం కష్టమే. సర్వేల ప్రకారం, భారతీయ అమెరికన్లు ఓవరాల్‌గా కమలా హ్యారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహిళలు, అమెరికాలో పుట్టిన వాళ్లు కమలకు అండగా ఉండగా.. భారతీయ పురుషులు మాత్రం కమలతోపాటు ట్రంప్‌కు కూడా బాగానే మద్దతు తెలుపుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో కమలా హ్యారిస్ వైపు అందరూ మొగ్గుచూపుతున్నారు.
సరిహద్దు పరిరక్షణ, వలసలను అరికట్టే విషయంలో ట్రంప్‌కు మద్దతు ఎక్కువగా ఉంది.
ఆర్థిక వ్యవస్థ విషయంలో ఇద్దరికీ దాదాపు సమానంగానే మద్దతు లభిస్తోంది. ట్యాక్సెస్ విషయంలో ట్రంప్‌కే ఎక్కువ మంది అండగా ఉన్నారు. ఎందుకంటే అతను ట్యాక్స్‌లు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. మహిళల హక్కులు, అబార్షన్ విషయంలో కమలకు మద్దతు ఎక్కువగా ఉంది. భారత్‌కు సంబంధించిన అంశాల్లో ఇద్దరి పాలసీలు బాగానే ఉన్నాయి. అయితే భారత ప్రధాని మోదీతో ట్రంప్‌కు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కమల భారతీయ మూలాలు ఆమెకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థి వీసాలు, హెచ్1బీ వీసాల విషయంలో కమల పాలసీ బాగున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రెసిడెంట్ బైడెన్ హయాంలో చేసిన పాలసీ మార్పుల వల్ల ఎంతోమంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు లభిస్తున్నాయి.
అన్ని విషయాలు గమనించిన తర్వాత ఈ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాను.






