Mumbai: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పతనం..
భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 98 పైసలు నష్టపోయి రూ. 89.66 వద్ద ముగిసింది. రూపాయి విలువ 89 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లలో ఒక్కరోజులో రూపాయి ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. 2022 ఫిబ్రవరి 24న రూపాయి 99 పైసలు నష్టపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి విలువ 4.6 శాతం మేర క్షీణించి, ఆసియాలోనే అత్యంత బలహీనపడిన కరెన్సీగా నిలిచింది.
దేశీయంగా దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఓ భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించడం, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. గత నెలలో ఎగుమతులు 11 శాతానికి పైగా తగ్గడం, బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరడం కూడా రూపాయి పతనానికి దోహదపడింది.
ఈ నేపథ్యంలో రూపాయి విలువ త్వరలోనే 90 మార్క్‌ను కూడా దాటవచ్చని యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనూజ్ గుప్తా అంచనా వేశారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశలు సన్నగిల్లడంతో డాలర్ ఇండెక్స్ మరింత బలపడి 102-103 స్థాయికి చేరవచ్చని, ఇది రూపాయిని మరింత బలహీనపరుస్తుందని ఆయన విశ్లేషించారు.






