Mohan Bhagwat: హిందువులు లేకుంటే ప్రపంచం ఉండదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat). హిందూ సమాజం, ప్రపంచ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకుంటే ప్రపంచం అంతరించిపోతుందని.. ప్రపంచ మనుగడకు హిందూ సమాజమే కేంద్రమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ పర్యటనలో భాగంగా ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రీస్ (యూనాన్), ఈజిప్ట్ (మిస్ర్), రోమ్ వంటి గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ భారత నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచి ఉందని మోహన్ భగవత్ గుర్తుచేశారు. “ప్రపంచంలోని ప్రతీ దేశం ఎన్నో రకాల గడ్డు పరిస్థితులను చూసింది. కానీ మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. హిందూ సమాజం అమరమైనది” అని ఆయన వివరించారు.
భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని పేర్కొన్న భగవత్.. ప్రపంచ ధర్మాన్ని కాపాడే సంరక్షకులుగా హిందూ సమాజాన్ని అభివర్ణించారు. “మన సమాజంలో మనం నిర్మించుకున్న బలమైన వ్యవస్థ కారణంగా హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుంది. హిందువులు లేకపోతే ప్రపంచం అంతం కావడం ఖాయం” అని ఆయన అన్నారు.






