TANTEX: “నెల నెలా తెలుగువెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 220 వ సమావేశము
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ”నెల నెలా తెలుగువెన్నెల” 220 వ సాహిత్య సదస్సు 2025 నవంబర్ నెల 16 వ తేదీ ఆదివారం నాడు డాలస్ టెక్సాస్ నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా అద్భుతంగా జరిగింది. ”మహాకవి వాక్పతిరాజు – సాహితీ విహంగ వీక్షణం” అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. ప్రార్ధన గీతాన్ని చిరంజీవి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించడంతో సదస్సు ను ప్రారంభించడం జరిగింది. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ముందుగా ఈ నెలలో మనను విడిచి వెళ్ళిన ప్రముఖ ప్రజా కవి అందెశ్రీ గారికి మరియు సంస్థ శ్రేయోభిలాషి స్థానిక వ్యాపారవేత్త అవర్ ప్లేస్ బాబు గారికి నివాళిగా ఓ నిమిషం మౌనం పాటించారు.
ముఖ్య అతిథి తన ప్రసంగములో రసజ్ఞత యొక్క ఆవశ్యకతను, తైత్తరీయ ఉపనిషత్తు లో చెప్పబడిన 22 ఆనందాల వివరాలతో చక్కగా విశదపరిచారు. అలాగే కావ్య పఠన అవసరాన్ని అది హృదయాన్ని ఎలా కదిలిస్తుందో వివరిస్తూ భవభూతి సమకాలీనుడు యశోవర్మ ఆస్థాన కవి అయిన మహాకవి వాక్పతి రాజు జీవన యానాన్ని, వారి సాహితీ వైభవాన్ని సోదాహరణముగా కళ్ళకు కట్టినట్లు ప్రసంగించారు.
సంస్కృత ప్రాకృతాలలో తన పాండిత్యము, ఉపమాలంకారానికి కాళిదాసు ప్రసిద్ధుడయితే ఉత్ప్రేక్షకు వాక్పతి రాజు అంతే పేరు గదించాడని తెలిపారు. వారు రాసిన ‘గౌడ వధ ‘ కావ్య పరిచయాన్ని మరియు దానిలోని వివిధ ఘట్టాలను ఉదహరిస్తూ వాక్పతి రాజు సాహితీ ప్రతిభా విశేషాలను వేనోళ్ళ కొనియాడారు.
అనంతరము అందెశ్రీ గారికి నివాళి గా ప్రసాద్ తోటకూర, దయాకర్ మాడా, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, చిన సత్యం వీర్నపు, లెనిన్ వేముల, కిరణ్మయి గుంట తదితరులు వారితో తమ అనుబందాన్ని అమెరికాలో వారితో గడిపిన సమయాన్ని, ఈ వేదికపై వారి ప్రసంగ సమావెశపు విశేషాలను గుర్తు చేసుకుని శ్రద్దాంజలి గటించారు. అలాగే వారి కొన్ని పాటలు లెనిన్ పాడి అందరినీ అలరించారు. సాహితీప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 90 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ధారావాహిక”మనతెలుగుసిరిసంపదలు”అందరినీ ఆకట్టుకుంది.
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథికి సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది.వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.






