Padmaja – Babu: బూతులు తిట్టిన ‘ఆమె’కు బాబు భారీ గిఫ్ట్!
“ఇది మంచి ప్రభుత్వం” అనేది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ నినాదం. అయితే, పాలనలో మంచి ఉండాలి కానీ, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మరీ ఇంత ‘మంచితనం’ అవసరమా? అన్న ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులను తొలిచేస్తోంది. దీనికి ప్రధాన కారణం… గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసి, నాడు టీడీపీ అధినేత కుటుంబంపైనే తీవ్ర విమర్శలు చేసిన నారమల్లి పద్మజకు (Naramalli Padmaja) బకాయి జీతాలు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడమే.
వైసీపీ హయాంలో సలహాదారుల వ్యవస్థ ఎంత భారీగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాకు చెందిన నారమల్లి పద్మజను ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. ఆమె 2023 నుండి 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. విచిత్రమేమిటంటే, ఆమెను నియమించిన జగన్ (YS Jagan) ప్రభుత్వం, ఆమె పదవీ కాలంలో ఒక్క రూపాయి కూడా జీతం చెల్లించలేదు. ప్రభుత్వం మారాక, తనకు రావాల్సిన బకాయి జీతభత్యాలను చెల్లించాలని ఆమె కూటమి ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన చంద్రబాబు (CM Chandrababu) సర్కార్, వెంటనే స్పందిస్తూ ఆమెకు జీతాలు చెల్లించాలంటూ జీవో జారీ చేసింది.
కేవలం ఒక మాజీ అధికారికి లేదా సలహాదారుకు జీతం చెల్లించడంపై ఇంత రాద్ధాంతం ఎందుకు అనే సందేహం రావచ్చు. కానీ, ఇక్కడ సమస్య జీతం కాదు.. ఆ వ్యక్తి.! నారమల్లి పద్మజ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం సలహాదారుగా మాత్రమే వ్యవహరించలేదు. ఆమె నిత్యం వైసీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని టీడీపీ, జనసేన నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిలను ఉద్దేశించి పద్మజ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెకు, ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం, అదే భువనేశ్వరి భర్త ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం జీతాలు చెల్లించడం కూటమి కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. నాడు మనల్ని బూతులు తిట్టిన వారిని, నేడు మనమే పోషించాలా? అన్న ఆవేదన సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది.
ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనా శైలికి, జగన్ పాలనా శైలికి ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనించవచ్చు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారు. అది అభివృద్ధి పనులైనా సరే, టీడీపీ ముద్ర ఉందన్న కారణంతో ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టారు. దీనివల్ల చాలామంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోయారు. కానీ నేడు చంద్రబాబు వైసీపీ హయాంలో చేసిన పనులకు, ఆఖరికి వైసీపీ నాయకులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేస్తున్నారు. నారమల్లి పద్మజ విషయంలోనూ ఆయన రాజకీయ కోణాన్ని పక్కనపెట్టి, పరిపాలనాపరంగా ఆమెకు దక్కాల్సిన హక్కును గౌరవించారు. కానీ, ఈ రాజధర్మం క్షేత్రస్థాయి కార్యకర్తలకు రుచించడం లేదు. ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టడమే రాజకీయమని భావించే ఈ రోజుల్లో, శత్రువుకు సాయం చేయడం చేతకానితనంగా మారుతుందన్నది వారి వాదన.
ఈ ఎపిసోడ్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, నారమల్లి పద్మజ దివంగత చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నారమల్లి శివప్రసాద్ సోదరి కావడం. శివప్రసాద్, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పార్లమెంటులో ఏపీ హక్కుల కోసం వినూత్న వేషధారణలతో పోరాడిన వ్యక్తి. ఆయన పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవం, అభిమానం కూడా పద్మజ ఫైలుపై సానుకూలంగా సంతకం చేయడానికి ఒక కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పద్మజ ఎప్పుడూ అన్న దారిలో నడవలేదు. ఆమె కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరి అన్న ప్రాతినిధ్యం వహించిన పార్టీపైనే విమర్శలు చేశారు.
మొత్తానికి, “ఇది మంచి ప్రభుత్వం” (idi manchi prabhutwam) అనిపించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం, సొంత పార్టీ శ్రేణుల నుండే “మరీ ఇంత మంచితనం పనికిరాదు” అనే విమర్శను ఎదుర్కొంటోంది. పరిపాలనలో నిష్పాక్షికత ఉండటం మంచిదే అయినా, గతంలో తమను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చడం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న వాదనలోనూ నిజముంది. రాబోయే రోజుల్లోనైనా మంచికి, రాజకీయ అవసరాలకు మధ్య ప్రభుత్వం గీత గీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.






