Mudragada: పవన్‌కు గట్టి పోటీగా ముద్రగడ కుటుంబం.. వైసీపీ మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) పేరు వినగానే గడిచిన దశాబ్దాల రాజకీయ ప్రయాణం గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ (Congress) నుంచి మొదలై తెలుగుదేశం పార్టీ (TDP), బీజేపీ (BJP), మళ్లీ కాంగ్రెస్ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వరకు ఆయన చేసిన ప్రయాణం అరవై ఏళ్ల రాజకీయ పంథాను చూపిస్తుంది. కానీ ఆయనను సాధారణ రాజకీయ నాయకుడిగా చూడరు. తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఎప్పుడూ నడిచే నాయకుడిగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నా కూడా తన ఆలోచనలకు విరుద్ధంగా ఏదీ చేయలేదని ఆయన అనుచరులు చెబుతుంటారు.
ముద్రగడ కాపు సమాజంలో ఇప్పటికీ ప్రత్యేక స్థానం పొందుతున్నారు. ఇటీవల ఆరోగ్య సమస్యలు వచ్చినా, తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మరలా ముఖ్యమంత్రి కావడానికి తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించిన విషయం రాజకీయంగా కీలకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ రాజకీయ వ్యవహారాల కమిటీ (Political Affairs Committee)లో స్థానం కల్పించింది. అలాగే ఆయన కుమారుడు ముద్రగడ గిరికి ప్రత్తిపాడు (Prathipadu) నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించింది.
ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో జరుగుతున్న రాజకీయ మార్పులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్, ముద్రగడ కుటుంబానికి ప్రాధాన్యం పెంచుతోందనే ప్రచారం బలపడింది. ముఖ్యంగా ముద్రగడ గిరిని ప్రత్తిపాడు కంటే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేయించే ఆలోచన పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. ముద్రగడకు పిఠాపురంలో మంచి పట్టు ఉండటంతో ఆయన రంగంలోకి దిగితే వైఎస్సార్ కాంగ్రెస్‌కు అక్కడ బలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పిఠాపురం ఇంచార్జిగా ఉన్న వంగా గీత (Vanga Geetha) పనితీరు పట్ల పార్టీ అసంతృప్తిగా ఉందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా పిఠాపురం సీటు వద్దని, మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పిఠాపురం నుంచి ఆమె దాదాపుగా తప్పుకున్నట్టే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై 2024లో కాపు వర్గం స్పష్టమైన మద్దతు ఇచ్చినా, కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందనే అభిప్రాయం వైఎస్సార్ కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తి 2029 నాటికి మరింత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే పవన్‌కు గట్టి పోటీగా ముద్రగడ కుటుంబాన్ని రంగంలోకి దింపే వ్యూహం వైఎస్సార్ కాంగ్రెస్ పరిగణనలో పెట్టినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ వర్సెస్ ముద్రగడ సమరం జరిగితే అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముద్రగడ ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారో, ఆయన కుమారుడు పోటీకి సిద్ధమవుతారో అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.






