YV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి వాంగ్మూలం..సిట్ దర్యాప్తుకు కొత్త దిశ
వైసీపీ (YCP) ముఖ్య నాయకుడు ,టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)ను టీటీడీకి (Tirumala Tirupati Devasthanams) కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో సీబీఐ సిట్ (CBI SIT) ప్రశ్నించింది. ఆరోగ్య కారణాల వల్ల తిరుపతి (Tirupati)కి రాలేనని ఆయన ముందుగా తెలిపిన నేపథ్యంలో, సిట్ అధికారులు గురువారం హైదరాబాదులో (Hyderabad) ఉన్న ఆయన నివాసానికి వెళ్లి ఏడు గంటలపాటు విచారణ చేపట్టారు. 2019 నుంచి 2023 మధ్య ఆయన టీటీడీ చైర్మన్గా (TTD Chairman) పనిచేసిన కాలంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టుల ఎంపికకు సంబంధించి వివిధ అంశాలను అధికారులు తెలుసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే సుబ్బారెడ్డి మాజీ పీఏగా ప్రచారం జరిగిన చిన్న అప్పన్న (Chinna Appanna)ను సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచి మీడియా వర్గాలలో సుబ్బారెడ్డి పాత్రపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అనంతరం సుబ్బారెడ్డి ఈ ఆరోపణలపై స్పందిస్తూ చిన్న అప్పన్న తన పీఏ కాదని స్పష్టం చేశారు. అతడు 2018లోనే తన వద్ద పని మానేశాడని, తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ భవన్ (AP Bhavan) లైజన్ ఆఫీసర్గా చేరినట్లు తనకు తెలిసిన విషయమని వివరించారు. తన వద్ద పని మానేసిన తర్వాత చిన్న అప్పన్న కొంతకాలం నెల్లూరు (Nellore) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వద్ద, తరువాత తెలంగాణ (Telangana)కు చెందిన మరొక ఎంపీ వద్ద పనిచేశాడని కూడా చెప్పారు.
కల్తీ నెయ్యి కేసుపై తనకు ఎలాంటి సమాచారం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చిన్న అప్పన్నపై హవాలా మార్గంలో డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయనీ, అవి నిజమైతే అతడితో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు 2019 తరువాత మారినట్లు మాట్లాడుతున్నారని, అయితే నిజాలను తెలుసుకోవాలంటే 2014 నుంచి మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సూచించారు.
సీబీఐ సిట్ ఈ కేసులో మొత్తం 24 మందిపై కేసులు నమోదు చేసి, అందులో 9 మందిని ఇప్పటికే అరెస్టు చేసింది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy)ని కూడా విచారించారు. చిన్న అప్పన్న వాంగ్మూలం ఆధారంగా వైవీని ప్రశ్నించిన సిట్, నెయ్యి టెండర్ల ఎంపిక విషయాల్లో అధికారులే నిర్ణయాలు తీసుకున్నారని వైవీ వెల్లడించడంతో తదుపరి చర్యలపై ఆసక్తి పెరిగింది. ఈ విచారణ ప్రశాంతంగా ముగియడంతో వైసీపీ వర్గాల్లో కొంత ఊరట నెలకొంది. అయినప్పటికీ, సిట్ తదుపరి దశలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.






