Miss Universe: అందగత్తెల ఎంపిక మ్యాచ్ ఫిక్సింగేనా..?
మిస్ యూనివర్స్ 2025 పోటీలపై అనుమాన మేఘాలు అలముకుంటున్నాయి. మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్(Fatima Bosch)విజేతగా నిలిచిన కొద్ది గంటల్లోనే, పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన ఒమర్ హర్ఫౌచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ పోటీల్లో రిగ్గింగ్ జరిగిందని, విజేతను ముందుగానే నిర్ణయించారని ఆయన ఆరోపించారు. మిస్ యూనివర్స్ యజమాని రౌల్ రోచాకు, విజేత ఫాతిమా తండ్రికి మధ్య ఉన్న వ్యాపార ఒప్పందాల కారణంగానే ఆమెను గెలిపించారని బాంబు పేల్చారు.
“మిస్ మెక్సికో ఒక ఫేక్ విన్నర్” అంటూ ఒమర్ హర్ఫౌచ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఫైనల్‌కు 24 గంటల ముందే తాను ఈ విషయాన్ని ఓ అమెరికన్ ఛానెల్‌కు వెల్లడించానని తెలిపారు. దుబాయ్‌లో జరిగిన సమావేశంలో రౌల్ రోచా, ఆయన కుమారుడు తనను కలిసి, వ్యాపార ప్రయోజనాల కోసం ఫాతిమాకే ఓటు వేయాలని ఒత్తిడి చేశారని ఒమర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 2026 మే నెలలో HBO డాక్యుమెంటరీలో బయటపెడతానని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (MUO) అధ్యక్షుడు రౌల్ రోచా స్పందించారు. ఒమర్‌ను తాము న్యాయనిర్ణేతల ప్యానెల్ నుంచి తొలగించామని, ఆయన రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఒమర్ ఆరోపణలు …సంస్థ చేపట్టిన ‘బియాండ్ ది క్రౌన్’ అనే ఛారిటీ కార్యక్రమానికి నష్టం కలిగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మరోవైపు, రోచాతో అవమానకరంగా సంభాషణ జరగడం వల్లే తాను రాజీనామా చేశానని ఒమర్ తెలిపారు. అంతేకాకుండా, ప్రిలిమినరీ రౌండ్లకు ముందే ఒక రహస్య కమిటీ టాప్ 30 ఫైనలిస్టులను ఎంపిక చేసిందని ఆయన ఆరోపించారు.
మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి రహస్య కమిటీ లేదని, ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని తెలిపింది. ఒమర్ హర్ఫౌచ్ను తమ బ్రాండ్‌తో సంబంధం లేకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మిస్ యూనివర్స్ పోటీల ప్రతిష్ఠపై నీలినీడలు కమ్ముకున్నాయి.






