Chandrakashan: ఎంఐటీ అధిపతిగా తొలి భారతీయ అమెరికన్
ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) ( ఎంఐటీ) అధిపతి (ప్రొవోస్ట్)గా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అనంత చంద్రకాశన్ (Ananta Chandrakashan) నియమితులయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాలయ నేతృత్వ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ అమెరికన్ (Indian American) ఆయనే. జులై 1న ఆయన నూతన పదవీ బాధ్యతలు చేపడతారు. తమ విద్యాసంస్థలో అనేక కొత్త ఆవిష్కరణలకు నేతృత్వం వహించడంతో పాటు అసాధారణ మైన ప్రతిభ, ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఆయన సుదీర్ఘమైన అంతర్గత అభ్యర్థుల జాబితా నుంచి ఎంపిక చేసినట్టు ఎంఐటీ అధ్యక్షుడు స్యాలీ కోంబ్లత్ (Sally Kornbluth) తెలిపారు. ఎంఐటీకి ప్రొవోస్ట్గా ఎన్నికైన వ్యక్తి సంస్థ విద్యా విషయాలకు బాధ్యునిగా ఉండటంతో పాటు ఆర్థికాంశాలనూ పర్యవేక్షిస్తారు. ఈ పదవికి ఎంపిక కావడం తనకు లభించిన అపారమైన గౌరవంగా భావిస్తున్నానని చంద్రకాశన్ అన్నారు. చెన్నైలో జన్మించిన చంద్రకాశన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్సులో కాలిఫోర్నియా (California), బర్క్లీ విశ్వవిద్యాలయాల నుంచి బీఎస్, ఎంఎస్, పీహెచ్డీలు పొందారు.







