Pak Drones: భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ల కలకలం
భారత సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ నుంచి కొన్ని డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చాయి. శనివారం సాయంత్రం ఇలా ఉన్నట్లుండి ఆకాశంలో డ్రోన్లు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సుమారు ఐదు చోట్ల ఇలా డ్రోన్లు (Pak Drones) భారత గగనతలంలోకి ప్రవేశించి చక్కర్లు కొట్టినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. దీంతో సరిహద్దు వెంబడి భద్రతా దళాలను హైఅలర్ట్ చేశారు.
భారత్‌లోని కొన్ని సున్నితమైన ప్రాంతాలపై ఈ డ్రోన్లు (Pak Drones) కొంతసేపు ఎగిరి, తిరిగి పాక్ వైపు వెళ్లినట్లు సమాచారం. రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో డ్రోన్‌ను గమనించిన భారత దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులకు ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలను (Drugs) చేరవేసేందుకే పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు (Search Operations) చేపట్టాయి.
ఇటీవలే సాంబా జిల్లాలోని పలూరా గ్రామంలో డ్రోన్లతో (Pak Drones) భారత్‌లోకి తీసుకొచ్చి పడేసిన ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఇలా డ్రోన్లు కనిపించడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.






