KTR: బీఆర్ఎస్ తోనే రాష్ట్రానికి మంచి రోజులు : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదని, ఇక్కడ బీజేపీ బలం కేవలం గాలివాటమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్లో ఆదిలాబాద్, మెదక్ (Medak)జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ (Assembly)లో ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేతలంతా ఘోర ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం గతంలో లేదు, భవిష్యత్తులో కూడా రాదన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు మంచి రోజులని, ఇతర పార్టీల వల్ల కాదని పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోరు ఉంటుందని, బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తున్నా, కృష్ణా జలాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తుకు వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.






