Swarna Bharat Trust:సేవా మార్గమే అసలైన వారసత్వం : వెంకయ్యనాయుడు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ (Swarna Bharat Trust) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణంలో నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రాసేనారెడ్డి (Indrasena Reddy), కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) లతో కలిసి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను సమర్థించనని వ్యాఖ్యానించారు. సమాజానికి సేవ చేయాలనే ధృక్పథమే తాను విశ్వసించే అసలైన వారసత్వమని అన్నారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో 25ఏళ్ల క్రితం ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్ట్‌ను, తన కుమార్తె దీపావెంకట్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. సంక్రాంతి అచ్చంగా రైతుల పండగ అని, మన దగ్గరున్న దానిని నలుగురితో పంచుకోవడమే పండగలోని అసలైన పరమార్థమని అన్నారు. తెలుగు రాష్ట్రాలు తమ పాలన వ్యవహారాలను తెలుగులో కొనసాగించాలని సూచించారు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు సూచించారు. స్వర్ణభారతి ట్రస్ట్‌ను సమర్థంగా నడిపిస్తూ, దీపావెంకట్ తండ్రికి తగ్గ తనయు అని నిరూపించుకున్నారని, ఆమె నాయకత్వంలో ట్రస్ట్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన వెంకయ్యనాయుడు జీవితం అందరికి ఆదర్శమని కొనియాడారు.






