Indian student : అమెరికా వీసా రద్దు కేసు .. భారత విద్యార్థికి తప్పిన బహిష్కరణ ముప్పు

అమెరికాలో విద్యార్థి వీసా రద్దై బహిష్కరణ వేటు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థి క్రిష్‌లాల్ ఐసర్ దాసానీ (Krishlal Isar Dasani )(21)కి ఫెడరల్ కోర్టు నుంచి ఊరట లభించింది. క్రిష్‌లాల్ విస్కాన్సిన్(Wisconsin )-మాడిసన్ (Madison) విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వచ్చే నెలలో తన గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేసుకోనున్నాడు. ఇలాంటి సమయంలో ఈ నెల 4న అతడి ఎఫ్-1 విద్యార్థి వీసా రద్దయింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎస్‌ఈవీఐఎస్) సమాచార నిధిలో వివరాలు తొలగించారు. దాంతో క్రిష్‌లాల్ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ తొలగింపునకు ముందు అతడికి ఎలాంటి హెచ్చరిక చేయలేదు. వివరణ ఇవ్వడానికి కానీ, ఒకవేళ తప్పు చేసి ఉంటే దానిని సరిదిద్దుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అని విచారణ సందర్భంగా బాధితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆ భారతీయ విద్యార్థిని బహిష్కరించకుండా ఉత్తర్వులు వెలువరించారు. వీసా రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతేడాడి నవంబరులో క్రిష్‌లాల్‌ను అమెరికా పోలీసుల అరెస్టు చేశారు. ఓ బార్ (Bar) బయట రెండు వర్గాల మధ్య గొడవలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం అతడిపై అభియోగాలు మోపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో పోలీసులు (Police) అతడిని వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే అతడి వీసా రద్దవ్వడం గమనార్హం.