అక్రమ వలసదారుల బహిష్కరణ కేంద్రానికి ఏర్పాట్లు
డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఆక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు అమెరికాలో ఏర్పాట్లు మొదలవుతున్నాయి. దీనిలో భాగంగా టెక్సాస్‌లో భారీ బహిష్కరణ కేంద్రం ఏర్పాటుకు ఆ రాష్ట్రం భూమిని సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జనరల్ ల్యాండ్ కమిషనర్ డాన్ బకింగ్ హామ్ డొనాల్డ్ ట్రంప్‌నకు ఓ లేఖ రాశారు. టెక్సాస్‌లో 1,402 ఎకరాల భూమిని అక్రమ వలసదారుల బహిష్కణ కేంద్రాల ఏర్పాటుకు వాడుకోవచ్చని పేర్కొన్నారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సహా ఇతర విభాగాలతో ఒప్పందం చేసుకొనేందుకు తమ కార్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, అక్రమ వలసదారుల దేశ బహిష్కరణ అంశం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడుకొన్న విషయం తెలిసిందే. విజయం తర్వాత కూడా తాను ఇచ్చిన హామీని అమలుచేస్తానని ఆయన పేర్కొన్నారు.






