డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం.. జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్టించేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలోని కీలక శాఖలకు ఇన్ఛార్జుల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైన అక్రమ వలసల నిరోధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను తనకు అత్యంత విశ్వసనీయుడైన టామ్ హోమన్‌ను బోర్డర్ జార్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు.అమెరికా జాతీయ సరిహద్దుల పరిరక్షణ విభాగ అత్యున్నతాధికారిని బోర్డర్ జార్‌గా అభివర్ణిస్తుంటారు. టామ్ హోమన్ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. సరిహద్దు భద్రతా వ్యవహారాలను నిర్వహించడంలో టామ్ హోమన్‌కు మంచి పట్టు ఉందని ట్రంప్ వెల్లడిరచారు. అమెరికా దక్షిణ, ఉత్తర సరిహద్దులను పర్యవేక్షించడంతో పాటు సముద్ర, విమానయాన భద్రతను పర్యవేక్షించడంలోనూ హోమన్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. బోర్డర్ జార్ నియామకానికి సెనెట్ అనుమతి పొందాల్సిన అవసరం లేదు.






