America : చైనాపై సుంకాలను 245 శాతానికి పెంచిన అమెరికా

ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా ఎగుమతు లపై ఏకంగా 245 శాతం సుంకాలను అమెరికా (America) విధించింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ (Boeing Company) విమానాల ఆర్డర్లను తీసుకోవద్దని తమ కంపెనీలను చైనా ఆదేశించడం తోపాటు కీలకమైన ఖనిజాల ఎగుమతిని నిలిపేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. అత్యంత కీలకమైన, అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపేయడంవల్ల జాతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై పరిశోధన జరపడానికి ఉద్దేశించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రొజు నుంచే అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ (First Trade Policy) కి అనుగుణంగా మేక్ అమెరికా ఎకానమీ గ్రేట్ ఎగైన్ కోసం ఆయన పని చేస్తున్నారు. 75కు పైగా దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఇప్పటికే మమ్మల్ని సంప్రదించాయి. అందుకే సుంకాలను ప్రస్తుతానికి నిలిపేశాం. ఒక్క చైనా తప్ప అని శ్వేతసౌధం (White House) విడుదల చేసిన వాస్తవ పత్రం వెల్లడిరచింది. అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై చైనా ప్రస్తుతం 245 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ పత్రం వివరించింది. గతంలో అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించిన చైనా వాటిని 125 శాతానికి పెంచింది.