Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!

తెలంగాణలో (Telangana) గ్రూప్ 1 (Group 1) పరీక్షలపై సందిగ్ధతకు తెరపడింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ (single bench) ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ (division bench) స్టే విధించింది. దీంతో తుది ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధమైంది. గ్రూప్ 1 వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసింది. మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఇది వివాదానికి దారి తీసింది. మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. అయితే ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగించింది.
2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ (TGPSC) 563 గ్రూప్-1 సర్వీసెస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 10న మెయిన్స్ మార్కులు, మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. మార్చి 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. అయితే, ఫలితాల విడుదల తర్వాత అభ్యర్థులు ఎవాల్యుయేషన్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలతోనే హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
గ్రూప్ 1 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆన్సర్ షీట్లను రీవాల్యుయేట్ చేయాలని ఆదేశించింది. మార్కుల జాబితా, ర్యాంకింగ్ లిస్ట్‌లను రద్దు చేసింది. రీ ఎవాల్యుయేషన్ పూర్తి కాకపోతే, ఎనిమిది నెలల్లో మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, లేకపోతే పూర్తి పరీక్షలు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. టీజీపీఎస్సీ ఈ తీర్పును సవాలు చేస్తూ సెప్టెంబర్ 11న డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది.
డివిజన్ బెంచ్ ఇవాళ ఈ అప్పీలుపై ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తుది జాబితా విడుదల, మార్కుల లిస్టు విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే తుది నిర్ణయానికి లోబడి ఈ చర్యలు ఉంటాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇది టీజీపీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. అందుకే తుది జాబితాను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమైంది. అయితే డివిజన్ బెంచ్ తీర్పుపై పిటిషనర్లు పైకోర్టుకు వెళ్తారా.. లేకుంటే తదుపరి విచారణ వరకూ వేచి ఉంటారా.. అనేది ఇప్పుడు ఆసక్తి రేపోతుంది.