Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట..!

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleswaram Project) అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ఉంది. దీంతో ఆమెపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు స్మితా సభర్వాల్ కూడా ఆ జాబితాలో చేరారు.
తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ (KCR), కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. గోదావరి నది నుండి నీటిని ఎత్తిపోయడం ద్వారా 16 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలనేది ఆయన లక్ష్యం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్లు ఖర్చయినట్లు అంచనా. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ పార్టీకి మరింత బలమైన ఆధారాలు దొరికినట్లయింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా మేడిగడ్డ బ్యారేజ్‌లో లోపాలు గుర్తించడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూలై 31న 665 పేజీల నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించారు. ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ బయటపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని నివేదించింది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు స్మితా సభర్వాల్‌పై ఉన్నాయి.
ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ తనకు నోటీసులు జారీ చేయకపోవడం, వాదనలు వినకపోవడం వల్ల ఇది కమిషన్ ఆఫ్ ఇన్‌క్వైరీ యాక్ట్ కు విరుద్ధమని ఆమె సవాలు చేశారు. నాపై కమిషన్ చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని విదించారు. నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. మరోవైపు ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ విచారణ ఘోష్ నివేదికపై ఆధారపడకుండా స్వతంత్రంగా జరగాలని ఆదేశించింది.