హైదరాబాద్ లో ఓ9 సొల్యూషన్ ఆర్అండ్డీ కేంద్రం
అమెరికాకు చెందిన గ్లోబల్ సప్లై చెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ9 హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇక్కడినుంచే ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలు అందించే విధంగా హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా మలుచుకోవాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా ఓ9 సహ వ్యవస్థాపకుడు, సీఈవో చక్రి గొట్టెముక్కల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది కార్యరూపం దాల్చిన వెంటనే రాష్ట్రంలో అత్యధిక వేతనాలతో కూడిన 1000 ఉద్యోగాలు రానున్నాయి. అంతేకాకుండా ఓ9 సొల్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది. స్థానిక ఇంజినీర్లు గ్లోబల్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను సాధించే విధంగా ఇక్కడ శిక్షణనివ్వనున్నారు.






