Note for Vote Case: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో (note for vote case) తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. జెరూసలెం మత్తయ్య పేరును కేసు నుంచి తప్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మత్తయ్య పేరును క్వాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయంటూ, హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 22న ఇరువైపులా వాదనలు విన్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జస్టిస్ బి.ఆర్. గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పును వెల్లడించింది.
2015 ఫిబ్రవరి 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం బయటికొచ్చింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరు సహచరులతో కలిసి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రూ.50 లక్షలు ఇచ్చి ఓటు తీసుకోవడానికి ప్రయత్నించినట్టు వీడియో ఫుటేజ్ బయటపడింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. దీనిపై కేసు పెట్టిన అప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఏ-1గా, రాజేందర్ ను ఏ-2గా, సంతోష్ ను ఏ-3గా చేర్చింది. అలాగే జెరూసలెం మత్తయ్యను (Jerusalem mathaiah) ఏ-4గా నమోదు చేసింది. మత్తయ్య ఈ లావాదేవీలకు మధ్యవర్తిగా పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి.
కేసు ఏసీబీకి బదిలీ అయిన తర్వాత, 2016లో తన పేరును కేసు నుంచి తొలగించాలంటూ మత్తయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అతని పిటిషన్‌ను అంగీకరించి, ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌లో అతని పేరును క్వాష్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఎల్విస్ స్టెఫెన్సన్ 2016లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017లో సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌లను అంగీకరించి, విచారణకు తీసుకుంది. దీని తర్వాత కేసు విచారణలో అనేక మలుపులు తిరిగాయి. 2024 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ నెల 22న సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది మేనకా గురుస్వామి వాదించారు. హైకోర్టు తీర్పు తప్పు అని, మత్తయ్య పాత్రపై పూర్తి దర్యాప్తు లేకుండా క్వాష్ చేయడం సరికాదని వాదించారు. ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌లో మత్తయ్య పేరు ఉండటం వల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, మత్తయ్య తరపు న్యాయవాదులు హైకోర్టు తీర్పు సరైనదేనని, ఆధారాలు లేకుండా అతన్ని నిందితుడిగా చేర్చడం తప్పు అని వాదించారు. వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ఈరోజు వెల్లడించింది. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి చట్టపరమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత్తయ్య పేరును క్వాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని తెలిపింది. దీంతో ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురుగా మారింది.
తీర్పు వెల్లడయ్యే ముందు మత్తయ్య సుప్రీంకోర్టుకు మూడు పేజీల లేఖ రాశారు. ఈ కేసులో అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడు అని, తను కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నానని మత్తయ్య పేర్కొన్నాడు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, నారా లోకేష్‌ల పాత్రలపై హైలెవల్ విచారణ చేయాలని కోరాడు. “నేను సరెండర్ అయితే రేవంత్ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు” అంటూ మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ లేఖపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు స్పందించలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ కేసు మలుపు తిరిగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.