హైదరాబాద్ లో లులు మాల్ ప్రారంభం
తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన లులు గ్రూప్. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సరళీకృత, అనుకూల వ్యాపార వాతావరణం కల్పించాలని ఆ సంస్థ కోరినట్లుగా మున్ముందు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో లులు మాల్‌ను మంత్రి ప్రారంభించారు. 25కు పైగా దేశాల్లో 270 హైపర్ మార్ట్లు ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆ గ్రూప్ ఉపాధి కల్పిస్తోందన్నారు. తెలంగాణలోనూ సూపర్ మార్కెట్లు, మాల్ల ఏర్పాటుతో పాటు ఆహార శుద్ధి, ఇతర అనుబంధ రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో మొట్ట మొదటి మాల్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎగుమతులు పెంచడంతో పాటు తెలంగాణ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.






