తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా శేఖర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో రూ.200 కోట్లతో నెలకొల్పిన పెంపుడు జంతువుల ఆహార తయారీ కేంద్రం ద్వారా పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. అదనంగా రూ.500 కోట్ల పెట్టుబడితో మా కార్యకలాపాల విస్తరణకు 2021 డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తాజాగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత వంటి విభాగాల్లో విస్తరణకు అవకాశాలనూ అందిపుచ్చుకుంటాం అని అన్నారు.






