BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ (Jubilee Hills Assembly) నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక (by election) జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ (BRS) గట్టి పట్టుదలతో ఉంది. తద్వారా అధికార కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని తెలంగాణకు చాటి చెప్పాలనుకుంటోంది. ఒక విధంగా ఇది రేవంత్ పాలనకు రెఫరెండం లాంటిదనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి లాక్కోవడం ద్వారా సత్తా చాటాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత గోపినాథ్ (Maganti Sunitha Gopinath) పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. గోపీనాథ్ సతీమణిని బరిలోకి దింపడం ద్వారా సానుభూతిని రాబట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కేడర్ కూడా సునీత వైపే మొగ్గు చూపింది. ఆమెను కేడర్ మొత్తం ఏకగ్రీవంగా బలపరిచింది. తెలంగాణ భవన్ తో పాటు ఎర్రగడ్డ డివిజన్ సమావేశాల్లో సునీతకు కార్యకర్తలు మద్దతు తెలిపారు. దీంతో సునీత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2018, 2023లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2023 తర్వాత కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వచ్చినా తలొగ్గకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే అనారోగ్య కారణాలతో హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన లేని లోటును అదే కుటుంబం భర్తీ చేయగలదని బీఆర్ఎస్ భావించింది. ఆయన కుమారుడిని బరిలోకి దింపాలని మొదట్లో అనుకున్నా, చివరకు భార్య సునీత వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. సునీతను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కేడర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమదే విజయమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఉపఎన్నికలో గెలిస్తే దానికి బలం చేకూర్చినట్లవుతుంది. అయితే సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ నోటికి తాళం వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలనుకుంటోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇరు పార్టీలకూ సవాల్ గా మారింది.