L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ ప్రాజెక్ట్ ను నడపడం తమ వల్ల కాదంటోంది ఎల్ అండ్ టీ (L&T). చాలాకాలంగా ఆ కంపెనీ తన గోడు వెళ్లబోసుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రోను మరింత విస్తరించాలనుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో విడత విస్తరణ అసాధ్యమని చెప్తోంది ఎల్అండ్ టీ. అయితే ప్రభుత్వ ప్రయారిటీలను అర్థం చేసుకోకుండా తమను బెదిరించే ధోరణిలో ఎల్ అండ్ టీ వ్యవహరిస్తోందనే ఆలోచనకు వచ్చింది రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్. దీంతో ఎల్ అండ్ టీకి, రేవంత్ రెడ్డి సర్కార్ కు మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లు సమాచారం. అందుకే ఎల్ అండ్ టీని సాగనంపేందుకు సిద్ధమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎల్ అండ్ టీ కూడా తప్పుకునేందుకు రెడీగా ఉందని సమాచారం.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రస్తుతం 69 కి.మీ.లలో, 3 కారిడార్లలో నడుస్తోంది. ఇందులో 90శాతం వాటా ఎల్ అండ్ టీకి ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో పాలుపంచుకున్న కంపెనీ, గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.625.88 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు ఏడాది రూ.555.04 కోట్ల నష్టం వచ్చింది. ఆపరేషనల్ రెవెన్యూ 21శాతం తగ్గి రూ.1,108.54 కోట్లకు చేరింది. కోవిడ్ సమయంలో 169 రోజుల పాటు మెట్రో నిలిచిపోయింది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నా నష్టాలు మాత్రం తప్పట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,000 కోట్ల సాఫ్ట్ లోన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే కేవలం రూ.900 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.200 ఎకరాల వాణిజ్య భూములున్నా కూడా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పటివరకూ రూ.7,000 కోట్ల పెట్టుబడి పెట్టామని, రూ.13,000 కోట్ల లోన్‌లు ఉన్నాయని ఎల్ అండ్ టీ చెప్తోంది. మొత్తం రూ.20,000 కోట్లకు ప్రాజెక్ట్‌ను తీసేసుకోవాలని కోరుతోంది. ఫేజ్-2లో పాల్గొనలేనని చేతులెత్తేసింది.
అయితే ఎల్ అండ్ టీ హెచ్చరికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ఎల్ అండ్ టీ ముందుకు రాకపోయినా రెండో విడత మెట్రోను ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ బెదిరింపుల వెనుక, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయని రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నారు.
తాజాగా ఎల్ అండ్ టీకి ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు పంపింది. మొదటిది- ఫేజ్-1 షేర్లను ఓపెన్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం. రాష్ట్రం హైయెస్ట్ బిడ్‌ను మ్యాచ్ చేసి తీసుకుంటుంది. రెండోది- రూ.13,000 కోట్ల లోన్‌ను రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయడం. మిగిలిన రూ.2,000 కోట్లను రాష్ట్రం చెల్లిస్తుంది. దీన్నిబట్టి మొత్తం వాల్యూ రూ.15,000 కోట్లుగా నిర్ధారించింది.
రేవంత్ ప్రభుత్వం ఫేజ్-2ను ప్రాధాన్యతగా పెట్టుకుంది. రూ.24,000 కోట్ల ఖర్చుతో 76.4 కి.మీ., ఐదు కారిడార్లు ప్రతిపాదించింది. కేంద్రంతో జాయింట్ వెంచర్‌గా ఉంటుంది. విస్తరణ తర్వాత ప్రయాణికులు 15 లక్షలకు పెరిగుతారని అంచనా. రోజుకు రూ10 కోట్ల రెవెన్యూ వస్తుందని, రుణాలు, ఖర్చుల తర్వాత రూ.2 కోట్ల వరకూ లాభం వస్తుందని లెక్కలేశారు. రైడర్‌షిప్ రెండు లేదా మూడు రెట్లు పెరిగితే, ప్రస్తుత రూ.600 కోట్ల వార్షిక నష్టాలు తీరిపోతాయని అంచనాలు చెప్తున్నాయి.
అయితే ఎల్ అండ్ టీ మాత్రం రెండో విడతకు సుముఖంగా లేదు. దీంతో ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ద్వారా తీసుకునే అవకాశం ఉంది. లేదంటే వేరే ప్రైవేట్ పార్టనర్‌ను తీసుకుని అప్పగించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.