తెలంగాణలో రూ.1,040 కోట్ల అరబ్ పెట్టుబడులు
దుబాయ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పలు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను, ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకొచ్చాయి. తొలిరోజే రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. అగ్నిమాపక పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో (ఎన్ఏఎఫ్ఎఫ్సీఓ) రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. రూ.215 కోట్ల పెట్టుబడితో తమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలిపింది. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ ఆలీ ప్రకటించారు. రూ.125 కోట్లతో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు మలబార్ గ్రూప్ ప్రకటించింది.






