KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?

తెలంగాణలో ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Car Race) వ్యవహారం మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు ఫైల్ పంపింది. ఏసీబీ నివేదిక ఆధారంగా రూపొందిన నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఈ ఫైల్‌పై న్యాయనిపుణుల అభిప్రాయం కోరుతున్నారు. న్యాయ నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- కార్ రేసు ఈవెంట్ జరిగింది. అప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఈవెంట్ నిర్వహణ కోసం 2022 అక్టోబర్ 25న ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (FEO), గ్రీన్‌కో గ్రూప్ సబ్సిడియరీ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో మున్సిపల్ శాఖ ఒప్పందే చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సీజన్ 9,10,11,12లకు హైదరాబాద్‌లో రేసులు నిర్వహించాలి. ఏస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్‌గా ఉండాలని నిర్ణయించారు. 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో సీజన్ 9 రేసు విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) రూ.12 కోట్లు ఖర్చు చేసింది.
అయితే సీజన్ 10 నాటికి సమస్యలు మొదలయ్యాయి. నష్టాల సాకుగా చూపి ఏస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్ పాత్ర నుంచి తప్పుకుంది. దీంతో 2023 అక్టోబర్ 30న HMDAనే ప్రమోటర్‌గా మారి, FEOతో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.90 కోట్లు స్పాన్సర్ ఫీ చెల్లించాలి. మరో మూడేళ్లకు రూ.600 కోట్లు ఫైనాన్షియల్ కమిట్‌మెంట్ చేయాలి. సెప్టెంబర్ 25, 29 తేదీల్లో FEO నుంచి రెండు ఇన్‌వాయిసులు వచ్చాయి. ఒక్కొక్కటి రూ.22.69, 23.01 కోట్లు ప్లస్ టాక్స్‌లకు సంబంధించిన ఈ ఇన్ వాయిస్ ల మొత్తాన్ని అక్టోబర్ 3,11 తేదీల్లో HMDA బ్రిటిష్ పౌండ్లలో చెల్లించింది. ఇక్కడే సమస్య మొదలైంది. అక్టోబర్ 9 నుంచి అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా, ఎంసీసీ అనుమతి లేకుండా ఫండ్స్ రిలీజ్ చేశారని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్లియరెన్స్ లేకుండా విదేశీ కరెన్సీలో పేమెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా, రూ.55 కోట్లు ఎఫ్‌ఈఓకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కేటీఆర్ చెప్పడం వల్లే ఈ నిధులు బదిలీ అయ్యాయని, దీనివల్ల రాష్ట్రానికి రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని ACB నివేదికలో వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024 జనవరి 7న ఎఫ్‌ఈఓ, సీజన్ 10 హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌ను క్యాన్సిల్ చేసింది. 2024 డిసెంబర్ 16న జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి ఇచ్చారని వెల్లడించారు. డిసెంబర్ 19న ACB కేటీఆర్, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మాజీ HMDA చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. డిసెంబర్ 20న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ERIR నమోదు చేసింది. 2025 జనవరి 6న, ACB కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. అతను విచారణకు హాజరు కాకుండా రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తొమ్మిది నెలలపాటు విచారణ జరిపిన ACB, కేటీఆర్‌ను నాలుగుసార్లు, అరవింద్ కుమార్‌ను ఐదుసార్లు పిలిపించింది. ఏస్ నెక్స్ట్ జెన్ ఎండీ కిరణ్ రావు, ఎఫ్‌ఈఓ ప్రతినిధులను కూడా ACB విచారించింది. ఫార్ములా ఈ స్పాన్సరింగ్ ఫర్మ్ ద్వారా రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్‌ల ద్వారా బీఆర్ఎస్‌కు రూట్ అయ్యాయని, క్విడ్ ప్రో కో జరిగిందని ACB తేల్చింది. సెప్టెంబర్ 9న ACB ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి, గవర్నర్ అనుమతి కోరింది. డిసెంబర్ 2024లోనే గవర్నర్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.