40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు… ప్రస్తుతం మోక్షం : సీఎం రేవంత్

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ సమీపంలో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడా అభివృద్ది జరగలేదని, నగరంలో గంజాయి పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు తెలిపారు.
ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యం తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందదని, ఈ కారిడార్‌తో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం. రెండో దశలో 75 కి.మీ. మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం. నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్ ధర్నా చేపట్టాలి. దానికి కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుంది. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు అని అన్నారు.