Minister Seethakka: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొమరం భీం వర్ధంతి : మంత్రి సీతక్క

ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం (Komaram Bheem) వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ (Tank Bund) పై ఆ మహానీయుడు విగ్రహానికి మంత్రి సీతక్క (Seethakka) పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రత్యేక జీవో ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహానాయకుడి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కొమరం భీం పోరాటం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటమని చెప్పుకొచ్చారు. మా గుడాల్లో మా రాజ్యం కావాలని మా అడవుల మీద మాకు హక్కు ఉండాలని పోరాటం చేశారు అని తెలిపారు.
కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయ్యిందని వెల్లడించారు. రాజ్యాంగంలో ఈశాన్య రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారన్నారు. మైదాన ప్రాంత రాష్ట్రాల్లోని ఆదివాసీల పరిరక్షణ కోసం షెడ్యూల్ 5ను రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. ఐటీడీఏ (ITDA) ఏర్పాటులోనూ కొమరం భీం స్ఫూర్తి ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధితోనే కొమరం భీం ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు.