TDP: తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలంగాణ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందున బీజేపీ (BJP) కోరితే జూబ్లీహిల్స్‌లో మద్దతు విషయం ఆలోచిద్దామని చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వాన్ని అందించేవారికే రాష్ట్ర అధ్యక్ష (State President) బాధ్యతలు అప్పగిస్తామని తెలంగాణ టీడీపీ నాయకులకు స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత కమిటీల నియామకాలు పూర్తిచేసుకుని కార్యక్రమాలు పెంచాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుదాం, ఇందుకోసం సంస్థాగతంగా బలోపేతం కావడం ముఖ్యం. అన్ని స్థాయుల్లో కమిటీలను పూర్తిచేయండి. ఎప్పటికప్పుడు నేను కూడా దిశానిర్దేశం చేస్తా అని చంద్రబాబు అన్నారు.