Ponnam – Adluri: అడ్లూరికి పొన్నం సారీ..! వివాదానికి ఫుల్ స్టాప్..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మధ్య కొద్ది రోజులుగా నెలకొన్న అంతర్గత వివాదం ముగిసింది. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చొరవతో ఈ ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిరింది. మహేశ్ గౌడ్ నివాసంలో జరిగిన భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశిస్తూ “దున్నపోతు” అని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మాదిగ వర్గానికి చెందినందునే తనను అవమానించారని, పొన్నం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. అయితే, పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాను వ్యక్తిగతంగా అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఈ వివాదం మాదిగ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దళిత సంఘాలు, కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు కూడా అడ్లూరికి మద్దతుగా నిలిచి పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో, పార్టీ ప్రతిష్టకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఆయన మంత్రులు ఇద్దరితోనూ ఫోన్‌లో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. దీనికి కొనసాగింపుగా, ఇవాళ మహేశ్ గౌడ్ తన నివాసంలో ఇద్దరు మంత్రులకు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా, మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పారు. “నేను ఆ వ్యాఖ్యలు చేయకపోయినా, పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాధపడినందుకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నారు. అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో దురుద్దేశం లేదు అని స్పష్టం చేశారు. మేమిద్దరం కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగామని, ఈ సమస్యను ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నానని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. “పొన్నం ప్రభాకర్‌ను నేను గౌరవిస్తా. కానీ ఆయన వ్యాఖ్యల పట్ల మాదిగ జాతి బాధపడింది. ఆయన క్షమాపణ కోరడంతో ఈ సమస్య ముగిసింది” అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని మహేశ్ గౌడ్ వారికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకూ చెందుతుందని, మంత్రులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నాయకత్వంలో ముందుకు సాగుతామని మంత్రులు ఇరువురు తెలిపారు.