Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కసుతో భారత్ పై ఆంక్షలు విధించిన ట్రంప్ యంత్రాంగం.. ఎప్పటికప్పుడు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తోంది. ఏదో విధంగా తమ దగ్గరకు వచ్చి, ఒప్పందం చేసుకుంటుందని ఆశించిన ట్రంప్ యంత్రాంగం.. ఇప్పుడు అలా జరగకపోవడంతో అసహనంతో ఉంది. లేటెస్టుగా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. తాము ఆంక్షలు విధించడాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
రష్యా నుంచి కొనుగోలు చేసే చమురే భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదని అమెరికా వాణిజ్య ప్రతినిధి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జెమీసన్ గ్రీర్ అన్నారు. అయినా ఇప్పటికే భారత్ తన చమురు కొనుగోళ్లను (India Oil Purchases) మాస్కో నుంచి మళ్లిస్తోందని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ది ఎకనామిక్ క్లబ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రష్యా (Russia)తో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ, గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మాస్కో నుంచి చమురు (Russian Oil)ను కొనుగోలు చేయలేదు. డిస్కౌంట్ ధరల కారణంగా గత రెండు, మూడేళ్ల నుంచి రష్యా చమురును ఎక్కువగా కొంటోంది. ఇది కేవలం వినియోగం కోసం మాత్రమే కాదు.. ఆ చమురును శుద్ధి చేసి రీసేల్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే భారత (India) ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు కొనుగోళ్లు ఒక్కటే బలమైన ఆధారం కాదని అర్థమవుతోంది. అందుకే వారు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పటికే వారు ఈ విషయంలో వైవిధ్యభరిత చర్యలు ప్రారంభించడం మేం చూస్తున్నాం’’ అని గ్రీర్ పేర్కొన్నారు.
ఇక, భారత్ సార్వభౌమత్వ దేశమని ట్రంప్ (Donald Trump) సలహాదారు అన్నారు. ఆ దేశం సొంత నిర్ణయాలు తీసుకోగలదని తెలిపారు. ‘‘ఇతర దేశాలు ఎవరితో సంబంధాలు కొనసాగించాలి.. ఎవరితో కొనసాగించకూడదు అనేది మేం చెప్పాలనుకోవడం లేదు. ఈ విషయంలో మేం ఎవర్నీ శాసించడం లేదు’’ అని గ్రీర్ తెలిపారు.
‘‘అమెరికాతో వాణిజ్యం కారణంగా భారత్‌కు 40 బిలియన్ డాలర్లకు పైగా మిగులు ఉంటోంది. మేం వారికి విక్రయించే దానికంటే.. భారత్ మాకు అమ్మేవే ఎక్కువ. అయితే, రష్యా చమురును కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి పుతిన్‌కు న్యూఢిల్లీ వనరులను అందించినట్లవుతోంది. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఈ స్థాయిలో సుంకాలు విధించాల్సి వచ్చింది. అయితే, టారిఫ్‌ల విషయంలో అమెరికాతో ఆ దేశం గొప్ప డీల్ చేసుకుంటోంది’’ అని గ్రీర్ వెల్లడించారు.