Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. మత్స్యకారులతో భేటీ..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో (Pithapuram) పర్యటించనున్నారు. ముఖ్యంగా ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కాలుష్యం కారణంగా జీవనోపాధి కోల్పోయి, తీవ్ర ఆందోళన చేస్తున్న మత్స్యకారుల (Fishermen) సమస్యలపై ఆయన దృష్టి సారించనున్నారు. వాళ్లతో కలిసి సముద్రంలో ప్రయాణించడమే కాక, వాళ్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపనున్నారు. అనంతరం పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు గత కొంతకాలంగా సముద్ర కాలుష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుండి రసాయన వ్యర్థాలను సముద్రంలోకి వదలడం వల్ల తమ జీవనం దెబ్బతిందని, చేపల సంపద తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యకారక పరిశ్రమలను తొలగించాలని లేదా కాలుష్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గ సమస్యపై స్పందించలేదంటూ మొదట్లో ఆయనకు వ్యతిరేకంగా కూడా నిరసనలు చేసి, పవన్ కల్యాణ్ వచ్చే వరకు వేటకు వెళ్లబోమని కూడా హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాలు, అనారోగ్య కారణాల వల్ల ఇంతకాలం పిఠాపురం వెళ్లలేకపోయిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమస్యపై దృష్టి పెట్టడానికి నియోజకవర్గ పర్యటనకు సిద్ధమయ్యారు. మత్స్యకారులను వెంటబెట్టుకొని సముద్రంలో ప్రయాణించి, కాలుష్యం జరుగుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. మత్స్యకారులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు.
ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పందించారు. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన గతంలో హామీ ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB), మత్స్య, రెవెన్యూ, పరిశ్రమల శాఖల సీనియర్ అధికారులతో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు, మత్స్యకారుల ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ కాలుష్య నియంత్రణకు పరిష్కారాలను, నష్టపరిహారాన్ని అంచనా వేసి, తీర గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారిస్తుంది. కమిటీ నివేదిక రాకముందే, చేపల వేటలో మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెల్లింపులు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం వంటి తక్షణ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించి, మత్స్యకారులకు భరోసా ఇవ్వడానికి పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు వస్తుండడంతో, తమ దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే ఆశ మత్స్యకార కుటుంబాల్లో కనిపిస్తోంది. ఉప్పాడలో పర్యటించిన అనంతరం పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.