Minister Tummala : రాజకీయ కక్షతో కేసులు పెట్టొద్దు : మంత్రి తుమ్మల

పార్టీల పరంగా రాజకీయ కక్షలతో ఎవరిపైనా కేసులు పెట్టొద్దని తాను పోలీసులకు సూచించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. ఖమ్మం (Khammam) నగరంలో పలు అభివృద్ది పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెడల్పు కోసం నాయకుల ఇల్లు అయినా కొంత తీసుకోక తప్పదని అన్నారు. బైపాస్ రోడ్డు వేసినప్పుడు నన్ను తిట్టుకున్నారు.ఇప్పుడు బైపాస్ రోడ్డు కూడా జామ్ అవుతోంది. రెండు, మూడు వందల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని అడిగి తీసుకుని వస్తాను. గుడిసెల్లో బ్రతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది. పేదలకు మంచి చేసే విధంగా రాజకీయం ఉండాలి. ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఖమ్మం నగరాన్ని అన్ని వసతులతో కూడిన సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీ. కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేది.నేడు ఖమ్మం నగరంగా మారిపోయింది. మీ డివిజన్‌లను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డివిజన్‌కు కావలసిన మౌలిక సదుపాయాల కోసం కమిషనర్ అభిషేక్ అగస్త్యను సంప్రదించండి. మన కార్పొరేషన్‌ను చూసి ఇతర ప్రాంతాలు నేర్చుకునేలా ఉండాలి. ఖమ్మం నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కక్షలకు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలి. ఉన్నతమైన చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికాన్ని వీడుతుంది. హైదరాబాద్, అమెరికా (America) కంటే మంచి చదువు ఖమ్మం నగరానికి వస్తుంది అని అన్నారు.